కేసముద్రం, ఆగస్టు 9 : మిరప నారును తెగుళ్ల నుంచి కాపాడుకునేందుకు నివారణ పిచికారీ చేస్తే అసలుకే మోసమైంది. మందు పనిచేయకపోగా వేసిన నారంతా ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముంద్రం మండలం ధన్నసరి, రాజీవ్‌నగర్‌కాలనీకి చెందిన గోపాల నర్సింహారెడ్డి, వేం నరేశ్‌రెడ్డి, రమేశ్, గుగులోత్ యాకు, మరికొందరు మిరప సాగు చేసేందుకు నెల రోజుల క్రితం మిరప విత్తనాలు కొనుగోలు చేశారు.
ఎకరానికి సుమారు రూ.15 వేల విలువైన మిరప నారు పోశారు. అయితే వరుస వర్షాల వలన మిరప నారుకు బుడిద తెగులు, వేరుకుళ్లు, ఆకుమచ్చ తెగులు సోకింది. 15 రోజుల నుంచి రోజూ కొంతమంది రైతులు ఓ ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లి మిరప నారుకు వచ్చిన తెగుళ్ల గురించి దుకాణదారుడికి తెలియజేయగా అతడు ఓ కంపెనీకి చెందిన మందు ఇచ్చి పిచికారీ చేస్తే తెగుళ్లు పోతాయని చెప్పాడు. సరేనని నమ్మి రైతులు మందు తీసుకెళ్లి పిచికారీ చేయగా వారం తర్వాత నారు మడిలోని మిరప మొక్కలు చనిపోయి ఎకరానికి రూ.20 వేల నష్టం వాటిల్లింది.
అంతేగాక మిరప సాగు చేయాలనుకుంటే మళ్లీ నారు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయమై రైతులు వ్యవసాయ అధికారి వెంకన్నకు ఫిర్యాదు చేయగా శుక్రవారం ఆయన ఎండిన మిరప నారును పరిశీలించారు. అలాగే ఫర్టిలైజర్ దుకాణంలో రైతులకు ఇచ్చిన మందుల శాంపిల్స్ సేకరించి నాణ్యతా పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా దుకాణదారుడిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఏవో చెప్పారు.