శాయంపేట, అక్టోబర్ 22 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకనుంచి పూడిక పనులుండవు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చెరువులు, కుంటల్లో పూడిక పనులు చేపట్టొద్దని డీఆర్డీఏ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ క్రమంలో కూలీలకు అధిక పనిదినాలు కల్పిస్తున్న ఈ పనులను ఎత్తేయడంతో తీవ్ర ప్రభావం పడుతుందని కింది స్థాయి అధికారులు చెబుతున్నారు. 2025-26లో అమలు చేసే పనుల విషయమై క్షేత్ర స్థాయిలో లేబర్ బడ్జెట్, ఉపాధి ప్రణాళిక తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాలకు వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధిలో 256 పనులను గుర్తించే వీలున్నది. అయితే గ్రామాల్లోని కూలీలు చెరువులు, కుంటల్లో పూడిక తీత పనులకే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పని దినాల టార్గెట్ చేరాలంటే ఈ పనులే చేయాల్సి ఉంటుంది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూడిక పనులుండవని, గ్రామ స్థాయిలో ఉన్న పనులతో ప్రణాళికలు తయారు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆదేశించినట్లు శాయంపేట మండల ఈజీఎస్ ఏపీవో అనిత చెప్పారు. గతంలో పనులు జరిగిన చెరువుల్లో మూడేళ్ల వరకు పూడిక పనులు చేపట్టొద్దని సూచించినట్లు తెలిపారు. దీంతో ఎప్పటిలాగే గ్రామాల్లో ఫీల్డ్, ఫీడర్ చానల్స్, మట్టి రోడ్ల పనులను గుర్తిస్తున్నారు. అలాగే చెక్‌డ్యామ్‌ల వద్ద పేరుకుపోయిన మట్టి తొలగింపు పనులు చేపట్టేందుకు అనుమతిచ్చారు. ఎస్సారెస్పీ కాల్వల్లో జంగిల్ క్లియరెన్స్, డీసిల్టింగ్ పనులు గుర్తిస్తున్నారు. అయితే వీటిల్లో పెద్ద ఎత్తున పూడిక ఉండటంతో పనులు చేపట్టాలా? వద్దా? అనే అయోమయంలో పడుతున్నారు.
ఫీడర్ చానల్‌ను మూడు కిలోమీటర్లకు ఎస్టిమేట్ వేస్తే 500 పనిదినాలు వస్తాయి. పెద్ద గ్రామాల్లో రోజుకు 800 మందికిపైగా కూలీలు పనికి వస్తుండడంతో అవి రెండు రోజులకు సరిపోవు. కూలీలకు రోజుకు రూ.300 చెల్లించాలని నిర్దేశించినప్పటికీ దాదాపు రూ. 215 వరకు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలు కల్పించడం కష్టంగా మారిందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఫాంపాండ్స్, చేపల చెరువుల పనులు చేపట్టాలని సూచిస్తున్నప్పటికీ చిన్న కమతాలు కావడంతో రైతులు ముందుకు రావడం లేదు. ఫాంపాండ్ 12 మీటర్లకు తక్కువ ఉండొద్దని నిర్దేశించడంతో దాదాపు ఐదు గుంటల భూమిని నీటికోసం వదులుతారా అన్న సందేహాలున్నాయి. శాయంపేట మండలంలో 10 వేల మంది జాబ్ కార్డులున్నవారు ఉన్నారని, వీరిలో ఆరు వేల మందికి పైగా పనుల్లోకి వస్తున్నారని, మొత్తం రెండున్నర లక్షల పని దినాలకు ప్రణాళిక తయారు చేయాల్సి ఉందని ఏపీవో తెలిపారు. నవంబర్ 28 వరకు ప్రణాళికలను పూర్తి చేసి అధికారులకు పంపిస్తామని చెప్పారు.
గ్రామసభ తీర్మానంతో ఎస్టిమేట్ తయారు చేసి పనులు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. దీంతోపాటు హార్టికల్చర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. మామిడి, జామ, సపోట, సీతాఫలం తోటలకు మూడేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించారు. ఐదెకరాలకు ఖర్చు కింద చెట్టుకు రూ. 15 ఇస్తారు. తోటలను బట్టి ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇక నుంచి ఒక్కో రైతు రెండు రకాల తోటలు వేసుకున్నా డబ్బులిచ్చేలా ఆదేశించారు. తోటల పెంపకంలో జాబ్ కార్డు ఉన్న రైతులకు ప్రోత్సాహం ఇస్తారు. గతంకంటే టార్గెట్‌ను పెంచి తద్వారా కూలీలకు పనులు కల్పించేలా నిర్దేశించారు. అయితే పత్తి, వరి తదితర పంటలకే రైతులు ప్రాధాన్యత ఇస్తుండటంతో కూలీలకు పనుల కల్పన ఎలా? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.