వేలేరు : బీఆర్ఎస్ పార్టీ టిటెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య అన్నారు. మంగళవారం వేలేరు మండల కేంద్రంలో మండల ఇంచార్జి భూపతిరాజు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.
రూ.200 కోట్లు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరి ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని అన్నారు.
ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ప్రపంచంలోనే మేటి సభల్లో ఒకటిగా నిలవబోతుందని చెప్పారు. ఈ సభకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వేలేరు మండలం మద్దెలగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు.