వరంగల్ చౌరస్తా: సమన్వయ పని విధానం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుం దని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. గురువారం జిల్లా పరిధిలోని పల్లె దవాఖానల వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేషించిన లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
విధుల నిర్వహణ, సమయపాలనపై ప్రత్యేక దృష్టి నిలపడం జరుగుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని అన్నారు. పల్లె దవాఖాన పరిధిలోని ప్రతి గర్భిణుల వివరాలను రికార్డుతో నమోదు చేయాలని, ప్రతి వారం పర్యవేక్షించాలని, మొదటి మూడు నెలల కాలంలోనే హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్య సూత్రాలను వివరించడంతో పాటుగా పాటించే విధంగా మోటివేషన్ చేయాలని సూచించారు.
టీబీ సర్వేలో గుర్తించిన వివరాలను ఎప్పటికప్పుడు నిశ్చల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. గడిచినన ఐదు సంవత్సరాలుగా టీబీ చికిత్స తీసుకున్న రోగులతో పాటుగా వారి కుటుంబసభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఎ డాక్టర్ ప్రకాష్, మాతాశిశు సంరక్షణ విభాగాధికారి డాక్టర్ ఆర్చన, డాక్టర్ ఆచార్య, జిల్లా ఏయిడ్స్ కంట్రోల్ మేనేజర్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.