వరంగల్ చౌరస్తా: జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఎంజీఎం నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల నుండి ఐఎంఏ హాల్ వరకు నిర్వహించిన అవగాహనా ర్యాలీని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్ ప్రధాన కూడలిలో ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు.
అనంతరం ఐఎంఏ హాల్ నందు జరిగిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ‘సమాజ భాగస్వామ్యంతో సత్వర నివారణ చర్యలు చేపట్టుట – పరిసరాల పరిశుభ్రత – ఆరోగ్యకరమైన జీవన విధానంతో డెంగ్యూ వ్యాధిని అరికట్టుట’ నినాదంతో కార్యాచరణ చేపట్టామన్నారు. ఈ డెంగ్యూ వ్యాధికారక ఈడీస్ దోమ పగటిపూట కుట్టడం ద్వారా వ్యాధి సోకుతుందన్నారు.
ఈ వ్యాధికారక దోమ నీటిలో వృద్ధి చెందుతుందని పరిసరాల పరిశుభ్రత పాటించడం, నీరు నిలువ ఉండకుండా చూడటం ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడం ద్వారా 90% వ్యాధిని అరికట్ట వచ్చునని తెలిపారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల ప్రజలలో అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించి వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం ద్వారా మరణాలను నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన ప్రజారోగ్య వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఆచార్య, డాక్టర్ అర్చన, డాక్టర్ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.