హనుమకొండ(ఐనవోలు): రైతులు పంట మార్పిడి పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కొండపర్తి, సింగారం గ్రామంలో ఏఈవోలు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఏవో సునిల్రెడ్డి శాస్త్రవేత్తలతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు మెట్ట పంటలో పత్తి, నేల రకం, నీటి వసతిని బట్టి మంచిశనగ, పెసర, మినుములు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నవ్వులు ,పచ్చ జొన్నలు పంటల గురించి ఆలోచించాలన్నారు.
పత్తి వంటి పంటను సైతం ఒంటిరిగా కాకుండా కందిలో అంతర్ పంటగా సాగు చేయాలని సూచించారు. అదే విధంగా వరి పంట సాగు చేసే రైతులు పంటకు ముందు పంట అవశేషాలను తగులపెట్టకూడదన్నారు. పచ్చిరొట్ట లేదా పెసరను సాగు చేయాలని సూచించారు. వీటి వలన యూరియా వాడకం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న, ఏఈవోలు అనూష, ఆఫ్రిన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.