హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 2: అవగాహన కార్యక్రమాలతో ఆటీజంని నివారించవచ్చని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితా రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని మల్లికాంబ మనో వికాసకేంద్రం ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆటిజం పిల్లల పట్ల గౌరవం, ప్రేమతో ఉండాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయసుకు తగ్గ ఎదుగుదల లేకుండా పుట్టిన పిల్లలను ఆటిజం పిల్లలగా గుర్తిస్తారని తెలిపారు. ప్రస్తుత కాలంలో గర్భం దాల్చిన సమయంలో అధిక ఒత్తిడికి లోనవడం, దగ్గర సంబంధాలు చేసుకోవడంతో చాలా మంది ఆటిజం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు ఆటిజం సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వారికి కొన్ని ముందస్తు చర్యల ద్వారా వారిలో సామాజిక నైపుణ్యాలు మెరుగుపరిచి మార్పు తీసికొని రావచ్చొన్నారు.
ఆటిజంపై అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన మల్లికాంబ మనో వికాస కేంద్రం వారిని డాక్టర్ అనితా రెడ్డి అభినందించారు. సమిష్టి కృషితో ఈ ఆటిజాన్ని నివారించవచ్చన్నారు. మల్లికాంబ సంస్థ వ్యవస్థాపకురాలు బండ రామాలీల మాట్లాడుతూ దీనికి శిక్షణ ఒక్కటే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కోడం కళ్యాణ్, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.