ఖిలావరంగల్: జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాజికంగా న్యాయం కోసం పోరాడి అమరుడైన దొడ్డి కొమురయ్య జీవితం స్పూర్తిదాయకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, కురుమ సంఘం ప్రతినిధులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తొలి వీరయోధుడని కొనియాడారు. సామాజిక సమానత్వం, రైతు హక్కుల కోసం ఆయన ప్రాణాలు అర్పించారన్నారు. ప్రతి ఒక్కరూ దొడ్డి కొమురయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.