వర్ధన్నపేట, అక్టోబర్ 25: 24 గంటలపాటు వైద్య సేవలందించాల్సిన వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అర్ధరాత్రి గర్భిణికి వైద్యం అందక తీవ్ర అవస్థలు పడింది. వైద్యులు అందుబాటులో లేరని వెళ్లగొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మం డలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర నాగమణికి పురిటి నొప్పులు రావడంతో గురువారం అర్ధరాత్రి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్టాఫ్ నర్సు గర్భిణిని చూసి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు లేరని, సరైన పరికరాలు కూడా లేవని చెప్పి వరంగల్ సీకే ఎం ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించింది. దీంతో 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే 108 వాహనం ద్వారా వరంగల్‌కు తీసుకువెళ్తుండగా తెల్లవారుజామున 2గంటల సమయం లో పంథిని గ్రామ సమీపంలో నాగమణికి నొప్పులు అధికమయ్యాయి. దీంతో పైలట్ ఎల్లాగౌడ్, మెడికల్ టెక్నీషియన్ సదానందం చాకచక్యంగా వ్యవహరించి కాన్పు చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. వెంటనే తల్లి, బిడ్డను సీకేఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రిలో 30 మంది వైద్యులు పనిచేస్తున్నా కనీసం రాత్రి సమయంలో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసినా వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నా రు. ఇప్పటికైనా మెరుగైన సేవలందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎంత బతిమిలాడుతున్నా నర్సులు వైద్యం చేయలేదని బాధితురాలి భర్త అజయ్, ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం డ్యూటీ డాక్టర్‌ను కూడా ప్రాధేయపడినా కూడా పిలవలేదని పేర్కొన్నారు. వెంటనే 108కు ఫోన్ చేసి వరంగల్ సీకేఎంకు తీసుకువెళ్తుంటే వాహన సిబ్బంది సహకరించడంతో ప్రసవం జరిగిందన్నారు.