వరంగల్ చౌరస్తా, నవంబర్ 3 : పేదల సంజీవనిగా పేరొందిన ఎంజీఎం దవాఖాన, కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యసేవలు అందని ద్రాక్షలా మారాయి. ఉచిత వైద్యమని ఇక్కడికి వస్తే కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. హాస్పిటల్లో వైద్యసేవలు పూర్తిగా వైద్యవిద్యార్థులే అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఎంజీఎం, కేఎంసీలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 30 మంది ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లగా, వారిలో సగంమంది కూడా భర్తీ కాకపోవడంతో విద్య, వైద్య సేవలు వెనకబడ్డాయి.
మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షలు ఊకదంపుడు ముచ్చట్లుగానే మిగిలిపోయాయి. జనరల్ మెడిసిన్, సైక్రియాట్రిక్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాలతోపాటుగా చాలా విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు స్థానికంగా ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోవడం లేదు.
విద్యార్థులు, రోగుల పరిస్థితిని వివరిస్తూ, పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్లు విధులకు ఆలస్యంగా హాజరు కావడం, కొన్ని సందర్భాల్లో డుమ్మా కొట్టడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ ఎంజీఎంను సందర్శించిన సమయంలో ప్రజావైద్యసేవలు మెరుగు పరచడం కోసం సత్వర చర్యలు తీసుకోవడంతోపాటుగా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించినప్పటికీ పలువురు ప్రొఫెసర్లు, వైద్యాధికారులు తమ పద్ధతిని మార్చుకోకపోవ డంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు.
పేదలకు గవర్నమెంట్ ఉచిత వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎంజీఎం సందర్శించిన ప్రతిసారి కలెక్టర్ వైద్యాధికారులను హెచ్చరిస్తున్నా అధికారులు, వైద్యుల తీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. వైద్యుల హాజరు పట్టిక నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో విధుల హాజరు, సమయపాలన విషయంలో ఉద్యోగులు, వైద్యులు పట్టింపు కరువయ్యింది.
దాంతో పేదల వైద్యసేవలు నీరుగారిపోతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఇటీవల ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల్లో సైతం చాలా వరకు వైద్యుల గైర్హాజరుపైనే ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇటీవల పరిపాల నా విభాగం, పారా మెడికల్, స్టాఫ్ నర్సుల హాజరు నమోదు బయోమెట్రిక్ యంత్రం మాయం వెనక కొందరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు ఎంజీఎం సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు.