భీమదేవరపల్లి, జూలై 1: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో మంగళవారం డాక్టర్స్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముల్కనూరు ప్రభుత్వ వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి, ప్రైవేట్ వైద్యులు సుధాకర్, స్వామిరావు లను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మండల నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల శాఖ అధ్యక్షుడు బొజ్జపురి మురళీకృష్ణ మాట్లాడుతూ వైద్యులు కనిపించే ప్రత్యక్ష దైవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినా, అత్యవసర పరిస్థితుల్లో రోగులు లేక వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే హాస్పిటల్కు వెళ్లి వైద్యులను సంప్రదించాలన్నారు.
మారుతున్న కాలానుగుణంగా ప్రతి ఒక్కరు మారాలన్నారు. మారుమూల కుగ్రామాలు, పల్లెలు, తండాల్లో కొంతమంది అజ్ఞానంతో ఇంకా నాటు వైద్యం తీసుకుంటున్నారని, దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం కేటాయించిన 108 వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల నాయకులు మామిడాల రవిందర్, సుద్దాల జవహర్, యాదగిరి, సుద్దాల వన రాజు, సంతోష్, ఉడుత శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.