కురవి, జూన్ 06 : జీవితం జీవించడానికేనని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని, వైఫల్యాలను వెక్కిరించి అఘాయిత్యాల ఆలోచనను మానుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిన మనిషి పరిపూర్ణడు అవుతాడని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు.
సీరోలు మండలం కొత్తూరు(సీ) గ్రామంలో ఆత్మహత్యల నివారణ కమిటీ ఆధ్వర్యంలో సామాజికవేత్త మలి శెట్టి వేణు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ.. ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల, సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలన్నారు. తనకి ఎవరూ లేరనే, అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకు పోయినప్పుడే, ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందన్నారు. ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని అన్నారు.
సీరోలు సబ్ ఇన్స్పెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ గత 20 ఏండ్లుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో ఆత్మహత్యలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ ఆదేశాల మేరకు ఆత్మహత్యల నివారణ సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. పీహెచ్సీ డాక్టర్ విరాజిత మాట్లాడుతూ.. జీవిత సంఘర్షణ, ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు, యోగా తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ వీరన్న, పీఎస్ హెచ్ఎం మనోహర్, గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్, స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ యాకూబ్, మరియు అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.