కాశీబుగ్గ, జూలై 6 ; ఎంజీఎంలో వైద్యుల తీరుపై వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సీరియస్ అయ్యారు. విధులకు హాజరుకాని 40మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జూలై నెల మొత్తం ముందే సంతకాలు చేసిన పిల్లల వైద్యుడి సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. శనివారం హాస్పిటల్‌లోని అన్ని విభాగాల్లో కలియదిరిగి సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన కలెక్టర్.. పాలన సక్రమంగా చేయాలని సూపరింటెండెంట్‌ను మందలించారు. ఎంజీఎంనే నమ్ముకొని వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో అలసత్వం పనికిరాదని విధులను నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. అ తర్వాత రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఎంజీఎం దవాఖానను శనివారం వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత క్యాజువాలిటీలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, సైకియాట్రిక్, న్యూమల్ సర్జికల్ వార్డు, ఇంటెన్సివ్ కేర్ సర్జికల్ యూనిట్, పిల్లల ఐసీయూ, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ, సెంట్రల్ ల్యాబ్, రేడియాలజీ, ఎమర్జెన్సీ క్యాజువాలిటీ తదితర విభాగాలను తనిఖీ చేశారు. అలాగే అధికారులకు సంబంధించిన అన్ని రిజిష్టర్లను పరిశీలించి విధులకు డుమ్మా కొట్టిన 40మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పిల్లల వైద్యుడు ఏకంగా జూలై నెల మొత్తం రిజిష్టర్‌లో సంతకాలు పెట్టడాన్ని గమనించిన కలెక్టర్ ఆ వైద్యుడిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేశారు.
ఆ తర్వాత వైద్యాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఎంజీఎం దవాఖానను నమ్ముకొని వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు కనీసం కూర్చునేందుకు సక్రమంగా కుర్చీలు లేవని, అధికారులకు మాత్రం పెద్ద పెద్ద గదులు నిరుపయోగంగా ఉన్నాయని, వైద్యులతో పాటు సిబ్బంది తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. సిబ్బంది, సదుపాయలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. పాలన సక్రమంగా చేయాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్డీవో కృష్ణవేణి, ఆర్ఎంవో మురళి, శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్, ఈఈ ప్రసాద్ పాల్గొన్నారు.