ఎప్పుడూ లేని విధంగా ఈసారి రైతన్నకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో ఆశించిన వానల్లేక చెరువుల్లోకి నీరు రాక కండ్లముందే పంటలు ఎండిపోతుండడం చూసి అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదేళ్లలో ఏ ఊరిలో చూసినా జలకళ సంతరించుకొని చెరువులు, చెక్‌డ్యాంలు మత్తడి దూకుతూ పంట పొలాలకు పరుగులు తీసేవి. ప్రస్తుతం సాగునీరు లేక, ఉన్న కొద్ది నీటిని పారిద్దామన్నా సక్రమంగా కరెంటు ఉండక పొలాలు నెర్రెలుబారుతున్నాయి. ఎప్పుడూ నిండుగా ఉండే చెరువులు ఈ సారి ఎండిపోయి వెలవెలబోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కుంటలు, రోడ్డు పక్కన గుంతల్లోని నీటి కోసం తంటాలు పడాల్సి వస్తోంది.
‘మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందం’గా అన్నదాతలకు కాలం విషమ పరీక్ష పెడుతున్నది. ఓ వైపు రుణమాఫీ కాకున్నా, రైతుభరోసా అందకున్నా అప్పోసప్పో చేసి పంటలు సాగు చేసిన రైతులకు వరుణ దేవుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. సకాలంలో వానలు పడక కర్షకులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కరకట్ట తెగిపోవడంతో వాగులో నీరు నిలిచే అవకాశం లేక, ఉన్న నీటిని పం టలకు పారించేందుకు కరెంట్ సక్రమం గా ఉండకపోవడంతో వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి.
పత్తి పంటలు వాడిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నర్సింహులపేట మండలంలోని ఉమ్మడి జయపురం శివారు బాసుతండా, బక్కతండా గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేసిన వరి పొలాలు నెర్రెలు బారుతున్నాయి. బోర్లు, బావుల ద్వారా నీళ్లు పారించుకుందామంటే కరెంట్ సక్రమంగా రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
24 గంటల కరెం ట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అందులో సగం కూడా రావడం లేదంటున్నారు. పావుగంట కరెంటు ఇస్తే అరగంటపాటు పోతున్నదని ఆందోళన చెందుతున్నారు. జయపురం శివారు ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం కరకట్ట తెగిపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే కిందికి పోతున్నదని చెబుతున్నారు. ఇక పెద్ద వంగర మండలంలోని శ్రీరాంసాగర్ కాల్వ పరీవాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయి.
ఉప్పరగూడెం, పోచంపల్లి, పెద్దవంగర, గంట్లకుంట, కొరిపల్లి గ్రామాల్లో వరి, పత్తి, మక్కజొన్న పంట పొలాలు సాగునీరు లేక నెర్రెలు బారుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీరాంసాగర్ ద్వారా సాగునీరందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నిండని చెరువులు..
తొర్రూరు డివిజన్‌లోనే అతిపెద్ద చెరువుగా ఉన్న మాటేడు గణపసముద్రంలో నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుంది. ఎనిమిదేళ్లుగా ఈ చెరువు ఈ సమయంలో వర్షాలు, గోదావరి జలాలతో నిండడం వల్ల సుమారు 800 ఎకరాలకు పైబడి ఆయకట్టు సాగులో ఉండేది. ఈ సంవత్సరం ఆశించిన వర్షాలు కురవక, కాళేశ్వరం జలాలు రాక చెరువు కింద వరి సాగుచేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెరువు నిండలేదని సాగు విస్తీర్ణం తగ్గించుకున్నప్పటికీ వేసిన పంటకు నీరు లేక ఎండిపోతున్నది. వాస్తవానికి చెరువులో జలమట్టం ఆధారంగా పొలాలకు సాగునీటి కోసం క్రమపద్ధతిలో తూముల ద్వారా నీటి విడుదల చేసేవారు. ఆడపాదడపా కురుస్తున్న వానలకు రోడ్డు పక్కన గుంతల్లో నిలిచిన నీటినైనా వాడుకోవాలని గంటకు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లకు మోటర్లు బిగించి పొలానికి పారించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.
ఎండుతున్న వరి పైర్లు
మాటేడు పెద్ద చెరువు కింద సాగవుతున్న వరి పైర్లు ఎండిపోతున్నాయి. వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న వరి పైర్ల తీరును గురువారం పరిశీలిస్తే లేగల అమృతారెడ్డి మూడు ఎకరాలు, బూర్గుల రామచంద్రయ్య నాలుగు ఎకరాలు, జె.సుబ్బారావు ఎకరం 20 గుంటలు, వల్లపు హరీశ్, నర్సయ్య, వెంకన్న, బూర్గుల మదార్, తాళ్ల మల్లయ్యగౌడ్లు రెండేసి ఎకరాల చొప్పున, తాళ్ల ఉప్పలయ్య ఎకరం భూమిలో వరి సాగు చేస్తున్నారు. చెరువు నీటిపైనే ఆధారపడి సాగు చేస్తున్న ఈ పొలాలకు సాగునీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాలు ఆడపాదడపా కురుస్తున్నా, వాతావరణంలో వచ్చిన మార్పులతో ఎండల తీవ్రత కూడా ఉండడంతో నేల నెర్రెలుబారి నీటి కోసం చూస్తు న్నది. రుణమాఫీ సక్రమంగా కాక, రైతు బంధురా క, సాగునీరు లేక అన్నదాత అల్లాడుతున్నాడు.
కళ్లముందే పంట ఎండుతాంది
చెరువు నీళ్ల పారకంతో వానకాలం, యాసంగి సాగు చేసేటోళ్లం. ఎనిమిదేళ్లుగా రెండు పంటలకు కడుపునిండా నీళ్లు వచ్చినయి. ఈ ఏడు కాల్వల్లో నీళ్లు రాక, వానలు సక్కగ పడక మా ఊరు చెరువు ఎండిపోతున్నది. కళ్ల ముందు పొ లం ఎండుతుంటే దుఃఖం వస్తాంది. సర్కార్ వెంటనే నీళ్లు పంపి మా చెరువు నింపి పంటలు కాపాడాలి.
– టీ సుబ్బారావు, రైతు, మాటేడు
పారిన మడే మళ్లీ పారుతాంది
నర్సింహులపేట : రెండు వారాల సంది కరెంట్ తిప్పల పెడుతాంది. పొద్దున వచ్చిన కరెంట్ రోజులో 10, 15 సార్లు పోతాంది. కరెంట్ పొయ్యి వచ్చేసరికి గంటల సమయం పడుతాంది. దీంతో పారిన పొలం మడే మళ్లా పారుతాంది. కరెంటోళ్లు ఇటు మొఖాన రావడం లేదు. మా రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదు.
– బానోత్ సీతారాం, బాసుతండా
రైతులకు అన్నీ కష్టాలే..
పెద్దవంగర : కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లుగా ఎస్సారెస్పీ నీళ్లు వచ్చేవి. వాటితోనే నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేసుకునేది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చింది. వీళ్లు కూడా అప్పటిలెక్కనే సాగునీరు ఇస్తరని అనుకొని లక్షలు ఖర్చు చేసి వరి వేసిన. నారుపోసిన కొద్ది రోజులకే సాగునీరు అందకపోవడంతో పెట్టుబడి రాక పంటలు ఎండుతున్నయ్. ఇప్పటికైనా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి రైతులను ఆదుకునేలా శ్రీరాంసాగర్ ద్వారా సాగునీరు అందించేలా చూడాలని కోరుతున్నా. కేసీఆర్ సర్కారు పెట్టుబడి సాయం, రుణమాఫీ మంచిగ ఇచ్చింది. కానీ ఇప్పడు రైతులకు అన్నీ కష్టాలే. – మైలపాక యాకయ్య, రైతు, పోచంపల్లి