జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : దీపావళి పండుగ సందర్భంగా భూపాలపల్లిలో ఏటా ఒకరి కనుసన్నల్లోనే దుకాణాలు ఏర్పాటయ్యేవి. అన్ని అనుమతులు తీసుకునే బాధ్యత అతడే తీసుకునేవాడు. ఇందుకోసం వ్యాపారుల నుంచి కొంత మొత్తం తీసుకునేవాడు. ఇప్పుడు పరిస్థితి మారింది. అతడికి మరొకరు జత కలిశారు. ఈ సారి అన్నీ తానే చూసుకుంటానని బాణసంచా వ్యాపారి వచ్చి చేరాడు. నాకే డబ్బులివ్వాలంటూ జులుం ప్రదర్శించాడు.
దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక్కో షాపు నుంచి రూ. 20,500 ముక్కు పిండి మరీ వసూలు చేసినట్లు వ్యాపారులే చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 26 షాపులకు రూ.5.33 లక్షలు సదరు వ్యక్తులకు అప్పగించినట్లు సమాచారం. వీరి షాపులకు సంబంధించిన అనుమతులన్నీ వారే తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ సొంతంగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవడానికి కుదరదు. డబ్బులు కట్టకుంటే దుకాణం ఎత్తేయాల్సిందేనని వ్యాపారులు వాపోతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 45 పటాకుల దుకాణాల ఏర్పాటుకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇందులో జిల్లా కేంద్రంలోనే 26 షాపులున్నాయి. చిట్యాల, మహదేవపూర్, కాటారంలో మినహా ఎక్కడ కూడా షాపులకు అనుమతులు లేవు. జిల్లా కేంద్రంలో ఒకే చోట దుకాణాలను పైరవీకారులు నిబంధనలకు విరుద్ధంగా ముగ్గుపోసి ఏర్పాటు చేయించారు.
దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే ఆన్లైన్లో రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అగ్నిమాపక శాఖతో పాటు పోలీసు, విద్యుత్, తూనికలు, కొలతల శాఖల అనుమతి పొందాలి. అయితే ఇక్కడ ఈ అనుమతులన్నీ డబ్బులు తీసుకొని ఆ ఇద్దరే తీసుకొస్తున్నారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా కర్రలతో షెడ్లను ఏర్పాటు చేశారు. దుకాణాల సమీపంలో ఇసుక బకెట్లు, నీళ్ల ట్యాంకర్లు ఏర్పాటు చేయలేదు. అయినా అధికారులు ఎలా అనుమతిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లిలో పటాకుల దుకాణాల వ్యాపారుల నుంచి ఇద్దరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసిన విషయం మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు పరిశీలించి, వారు ఏర్పాటు చేసుకున్న షెడ్లను, సేప్టీని చూసి అనుమతులు ఇస్తాం. డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం.
– కుమారస్వామి, ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్