ములుగు(నమస్తేతెలంగాణ)/తాడ్వాయి, జూలై 3 : పోడు పట్టాలతో గిరిజన రైతుల్లో వెలుగులు నింపుతున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కలెక్టర్ కృష్ణఆదిత్య అధ్యక్షతన జిల్లాకు చెందిన పోడు భూముల సాగుదారులకు హకు పత్రా లు, జిల్లాలో ప్రభుత్వ నిషేధిత సంస్థల్లో పనిచేస్తూ లొంగిపోయిన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథులుగా మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, రెడో చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఐటీడీఏ పీవో అంకిత్ పాల్గొని 847మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం గణంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిస్ట్రిక్ట్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పోడు హకుల చట్టం ఏర్పాటు చేసిన నాటి నుండి ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు మూడు లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ చేస్తే సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు 4.60లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించారన్నారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాల కారణంగానే పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. పోడు రైతులకు హకు పత్రాలను అందించిన అనంతరం రైతుబంధు, రైతు బీమా పథకాన్ని వర్తింప చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.406 కోట్లను వెచ్చిస్తోందన్నారు.
గిరిజన విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించేందుకు తగిన వసతులను ఏర్పాటు చేయడంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారనారు. కేంద్రం తీసుకొచ్చిన పోడు భూముల చట్టంలోని విధానాలతోనే హకు పత్రాలు అందించడంలో ఆలస్యం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చట్టంలో వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఏదో ఒక విధంగా అర్హులైన పోడు సాగుదారులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. గిరిజనేతర రైతుల భూముల జోలికి అటవీశాఖ అధికారులు వస్తే ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ఖమ్మం సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు కాని పథకాలను తెలంగాణలో అమలు చేస్తానని హామీలు ఇచ్చారని, అమలు కాని చట్టా లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు చేసిన చట్టాలతోనే ప్రజలు ఇబ్బందులు ఎదురొంటున్నారని గుర్తు చేశారు. కన్నతల్లికికి అన్నం పెట్టకుండా వినటానికి బంగారు గాజులు చేయిస్తామని రీతిలో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పాలిస్తున్న చత్తీస్ఘడ్ రాష్ట్రంలో నెలకు రూ.700 పెన్షన్ ఇస్తూ ఇకడ రూ.4000 ఇస్తామనడం నమ్మశక్యంగా లేదన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఐటీడీఏలను బలోపేతం చేసి, ఐఏఎస్ అధికారులు నియమించి గిరిజనులకు సేవలందిస్త్తున్నామన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న నేత సీఎంగా ఉండడం మన అదృష్టమని మంత్రి అన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేసేది తెలంగాణే
రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మానుకోట మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. పోడు పట్టాల విషయంలో దశాబ్దాల కాలంగా గిరిజనుల నిరీక్షణకు నేటితో తెరపడిందన్నారు. అడవి బిడ్డలైన ప్రకృతి పూజారులకు హకులు కల్పించిన మహానేత సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ ఇలాత్రిపాఠి, డీఆర్వో రమాదేవి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్‌నాయక్, ఎంపీపీలు వాణిశ్రీ, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీదేవి, జడ్పీటీసీలు సకినాల భవాని, హరిబాబు, పాయం రమణ, మేడారం సర్పంచ్ బాబురావు పాల్గొన్నారు.