గిర్మాజీపేట, ఏప్రిల్ 4: పేదింట్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని, ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ఆరోగానికి భరోసా కల్పిస్తున్నదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కొనియాడారు. శివనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన 38వ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులకు రూ. 5,99,580 విలువైన ఐదు కల్యాణలక్ష్మి, రెండు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆందజేసి మాట్లాడారు. పేదింట్లో ఆడబిడ్డల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించునేందుకు సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నారని తెలిపారు.
కరాటేలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు
గోవాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించిన మట్టెవాడకు చెందిన కాసాని శ్రీచరణ్, గోశికుండ నరేందర్‌ను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట హరీశ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మట్టెవాడ ఎస్సైగా విధుల్లో చేరిన నవీన్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలగం సత్యనారాయణ, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్‌కు సన్మానం
ధర్మసాగర్, ఏప్రిల్ 4: స్త్రీనిధి రుణాల్లో రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందిన హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్‌ను మంగళవారం మండలకేంద్రంలో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో జవహర్‌రెడ్డి, ఏపీఎం అనిత, ఏవో శ్రీనివాస్, డీపీఎం అనిల్‌కుమార్, వేలేరు ఏపీఎం సునీత, స్వర్ణ జ్యోతి మండల సమాఖ్య టీం అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి ప్రసన్న, పాల్గొన్నారు.