పోచమ్మమైదాన్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్నలు ఆత్మగౌరవంతో బతికేలా భరోసా కల్పిస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కొత్తవాడ అమరవీరుల స్తూపం నుంచి పద్మశాలీ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేత కార్మికులు నేసిన వస్ర్తాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన బతుకులు మారడానికి సీఎం సాధించిన విజయాలే ప్రగతి సోపానాలుగా నిలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నేతన్నలకు చేరువ అవుతున్నాయని తెలిపారు. నేతన్నకు చేయూత, నేతన్న బీమా, మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికీ రూ. 3 వేల నగదు జమ, చేనేత మిత్ర, హెల్త్ కార్డులు తదితర పథకాలు వారికి అందేలా మంత్రి కేటీఆర్ భరోసా కల్పిస్తున్నాయని కొనియాడారు. అలాగే, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేత కార్మికులను ఆదుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గోదాంలో నిల్వ ఉంచారని వివరించారు. నేతన్నలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నదని కొనియాడారు. నేతన్నల సమస్యలను ఎప్పటికప్పుడు తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
పట్టించుకోని గత పాలకులు
గత పాలకులు నేతన్నలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. పద్మశాలీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప వారి అభివృద్ధికి ఏనాడూ పాటుపడలేదని విమర్శించారు.
కొత్తవాడ నేతన్నలు తయారు చేసిన వాటిని రెండు నెలలకోసారి కొనుగోలు చేసేలా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మార్గం సుగమం చేశామని తెలిపారు. నేతన్నల బతుకుల్లో వెలుగు నింపడానికి కేసీఆర్ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. రాజకీయాలకతీతంగా అసెంబ్లీలో తాను నేత కార్మికుల గురించి మాట్లాడినట్లు గుర్తుచేశారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చేనేత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే, చేనేత సంఘాల పెద్దలను ఘనంగా సన్మానించారు. మేయర్ గుండు సుధారాణికి ఎమ్మెల్యే జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ అధికారులు, పలు సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
174 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కరీమాబాద్: పేదింటి ఆడబిడ్డల పెద్దన్న సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మండలంలోని 105 మంది లబ్ధిదారులకు ఓసిటీలోని క్యాంపు కార్యాలయంలో, ఖిలావరంగల్ మండలంలోని 69 మంది లబ్ధిదారులకు ఫోర్టురోడ్డులోని కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కనీవినీఎరుగని రీతిలో అభివృద్ధి సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరుతున్నాయని కొనియాడారు. పేదల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.