పరకాల, జూలై 17: అన్నివర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి సోమవారం డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే పేదలకు లబ్ధిచేకూరేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితబంధు కో ఆర్డినేటర్ సోదా రామకృష్ణ, కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, బీజేపీ నాయకుడు దేవునూరి మేఘనాథ్ పాల్గొన్నారు. కాగా, హనుమకొండలోని తన నివాసంలో నియోజకవర్గంలోని వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.కాగా, కొత్తగా ఎన్నికైన పరకాల మండల మేదర సంఘం సభ్యులు హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మేదర సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం బాధ్యులు ఎం.శ్రీధర్, సంఘ నరేశ్, కీర్తి వెంకటేశ్, గూడూరు రాజు, రాయబారపు దామోదర్, మాడిశెట్టి గోపి, సంఘ ప్రభాకర్ పాల్గొన్నారు.