హనుమకొండ, అక్టోబర్ 10: కాకతీయ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ విద్యార్థుల బాకీ కార్డును యూనివర్సిటీలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, జెట్టి రాజేందర్ మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ అధికారం కోసం ఇంటింటికి తిరుగుతూ గ్యారంటీ కార్డులను పంపిణీ చేసి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ వెళ్లి ప్రతి ఏటా నిరుద్యోగ యువతకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చేసిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
20వేలతో మెగా డీఎస్సీ అనిచెప్పి నిరుద్యోగులు దగా చేశారని, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తమ ఉద్యోగాలుగా చెప్పుకొని నియామక పత్రాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మరోవైపు విద్యా గ్యారెంటీ పేరుతో 5లక్షల రూపాయలు హామీ గాలికి వదిలేశారన్నారు.
8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వేలాదిమంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతున్నాయని, బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలు బయటకు పంపిస్తున్నారని ఇంతటి దుర్మార్గమైన పాలన రాష్ర్టంలో నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి దొంగనాటకాన్ని ఇక విద్యార్థులు సహించబోరని హెచ్చరించారు. బీఆర్ఎస్వీ నాయకులు గొల్లిపల్లి వీరస్వామి, కొనకటి ప్రశాంత్, పస్తం అనిల్, పిన్నింటి విజయకుమార్, రాసూరి రాజేష్, నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.