హస్తం పార్టీలో అసంతృప్తి సెగలు తారాస్థాయికి చేరాయి. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఖరారైన అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నది. ‘కలిసొస్తారో.. చేయిస్తారో’నని ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ మురళీనాయక్, కేంద్ర సహాయక మాజీ మంత్రి బలరాంనాయక్, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ పోటీ పడ్డారు. చివరకు మురళీనాయక్‌కు టికెట్ దక్కడంతో మిగిలిన ఇద్దరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివరకు వీరు డోర్నకల్, ఇల్లెందు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ స్థానాలను రాంచంద్రనాయక్, కోరం కనకయ్యకు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాలోత్ నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నెహ్రూనాయక్ మరో అడుగు ముందుకేసి నేడు ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తుండగా, కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది.
మహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు తారస్థాయికి చేరాయి. రెబల్స్ బెడద ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. మహబూబాబాద్, డోర్నకల్ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి చాలామంది టికెట్లు ఆశించారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న డాక్టర్ మురళీనాయక్, కేంద్ర సహాయక మాజీ మంత్రి బలరాంనాయక్, తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ ఉన్నారు. మహబూబాబాద్ టికెట్ డాక్టర్ మురళీనాయక్‌కు రావడంతో బలరాంనాయక్, బెల్లయ్యనాయక్ తమకు డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల నుంచి అవకాశం కల్పించాలని అధిష్ఠానానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. సోమవారం రాత్రి కాంగ్రెస్ అధిష్ఠానం డోర్నకల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానాలకు డాక్టర్ రాంచంద్రనాయక్, కోరం కనకయ్యను ఖరారు చేసింది. దీంతో ముందు నుంచి టికెట్ ఆశించినా దక్కకపోవడంతో బెల్లయ్యనాయక్, బలరాంనాయక్ ఇద్దరూ తీవ్ర మనస్థాపం చెందారు. బెల్లయ్యనాయక్ ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘నేను మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం అభ్యర్థన చేసినప్పటికీ ఎక్కడా నా విన్నపాన్ని మన్నించలేదు. నాకు ఏ కారణంతో సీటు ఇవ్వడం లేదో మీరు వివరణ ఇవ్వాలి. కొడంగల్ సీటు తనకు కేటాయించాలని కోరుతూ గాంధీభవన్ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా’నని లేఖ రాశారు.
కేంద్ర సహాయక మాజీ మంత్రి బలరాంనాయక్ తాను సీనియర్‌ను అయినా పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొంతమంది కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదనే సమాచారం. డోర్నకల్ నియోజకవర్గంలో ముందు నుంచి జాటోత్ రాంచంద్రునాయక్, మాలోత్ నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ టికెట్ కోసం పోటీపడ్డారు. చివరకు జాటోత్ రాంచంద్రునాయక్‌కు టికెట్ దక్కడంతో నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నది. బుధవారం కురవిలో తన అనుచరులతో కలిసి నెహ్రూనాయక్ సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో స్థానికుడికి కాకుండా పక్క జిల్లా నుంచి వలస వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన రాంచంద్రునాయక్, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండుమార్లు ఓడినా తిరిగి రాంచంద్రనాయక్‌కు టికెట్ ఇవ్వడంతో నెహ్రూనాయక్ తన ముఖ్య అనుచరుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల ముందు రావడం, ఓటమి తర్వాత తిరిగి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండని వ్యక్తికి టికెట్ ఇస్తే ప్రజలకు పార్టీ ఏమి సమచారం ఇస్తుందని తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తయారైంది. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించి భంగపడిన నాయకులకు ఫోన్ చేసి అధిష్ఠానం బుజ్జగిస్తున్నా నాయకులు వినడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 9న మహబూబాబాద్ అసెంబ్లీ స్థానానికి కేంద్ర సహాయక మాజీ మంత్రి బలరాంనాయక్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.