గోవిందరావుపేట, ఆగస్టు 11 : వేలాది ఎకరాలకు సాగునీరందించే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు కింద ఉన్న నాలుగు ప్రధాన కాల్వలు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. దీంతో తమకు నీరందేదెలా అని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీరాంపతి కోట, రంగాపూర్, నర్సింహుల కాల్వల ద్వారా ప్రస్తుత సీజన్లో పంట పొలాలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నాలుగు కాల్వల ద్వారా అధికారికంగా 8,500, అనధికారికంగా మరో 4 వేల ఎకరాల్లో పంట సాగవుతుంది.
అయితే కాల్వల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు అక్కడక్కడా గండ్లు పడ్డాయి. కాల్వల పరిస్థితిని పరిశీలించేందుకు అధికారులు అటువైపు రావడం లేదు. దీంతో పంట చివరి దశలో తమకు నీరందుతుందో లేదోననే భయాందోళనలో రైతులున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాల్వల్లో పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు గండ్లను పూడ్చివేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.