కాజీపేట, డిసెంబర్ 21 : దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లోనే ఉన్నా రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కాజీపేట-బల్లార్షా సెక్షన్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లను ఇప్పటి వరకు రైల్వే శాఖ ప్రకటించలేదు. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఏటా జరిగే అయ్యప్ప మండల పూజలు, జ్యోతి దర్శనానికి డిసెంబర్, జనవరి నెలల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది స్వాములు, భక్తులు వెళ్తుంటారు. కాజీపేట-బలార్షా సెక్షన్ పరిధిలోని సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి శబరిమలకు ఒక్క ప్రత్యేక రైలును కూడా రైల్వేశాఖ నడపడం లేదు. కేవలం నిజామాబాద్ నుంచి కొట్టాయం వరకు ఒక రైలును ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది.
అయితే సికింద్రాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వే శాఖ ఇతర ముఖ్య ప్రాంతాలను మాత్రం విస్మరించింది. మౌలాలి నుంచి వయా పంగిడిపల్లి, మిర్యాలగూడ, గుంటూరు రైల్వే స్టేషన్ల మీదుగా కొట్టాయంకు వెళ్లేలా ప్రత్యేక రైలు రూట్‌ను రైల్వేశాఖ ఖరారు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, నర్సాపూర్, గుంటూరు తదితర ముఖ్య రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ షెడ్యూల్ విడుదల చేయగా, స్వాములు టికెట్ల రిజర్వేషన్ కూడా పూర్తిచేసుకున్నారు.
ఇక ఉత్తర తెలంగాణలోని ప్రధాన జిల్లాల మీదుగా శబరిమల వెళ్లేందుకు ఇప్పటివరకు ఒక్క ప్రత్యేక రైలును కూడా ప్రకటించలేదని అయ్యప్పస్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ సమయానికే సిర్పూర్ కాగజ్‌నగర్, కరీంగనగర్, నిజామాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించి షెడ్యూల్ విడుదల చేసేదని వారు పేర్కొంటున్నారు. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో ఈ ప్రాంతంలోని లక్షలాది మంది భక్తులు స్వామి దీక్షలు తీసుకున్నారు. ఇప్పటికే కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా కేరళలోని తిరువనంతపురం (శబరిమల) వెళ్లే అన్ని రైళ్లలో టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియ ముగిసింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు రైల్వే అధికారులు ఎప్పుడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తారోనని స్వాములు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి కాజీపేట-బల్లార్షా సెక్షన్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.