ఇనుగుర్తి, జూలై 5 : చేతి వేళ్లపై నుంచి కార్లు పోనిచ్చుకోవడం.. ఛాతీ పై పెద్ద బండరాయిని పగులగొట్టించుకోవడం సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ ఓ దివ్యాంగుడు ఈ విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆత్మైస్థెర్యం ఉంటే ఏ పనికైనా అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు. అతడే మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన వడ్డెపల్లి యాకయ్య. ఐదేళ్ల వయస్సులోనే పోలియో సోకి ఎడమ కాలు చచ్చుబడిపోగా, చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు.
చేతికర్రనే ఊతంగా చేసుకొని పేదరికంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం తనకు జీవనాధారం కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. చిన్నతనం నుంచే యాకయ్య టీవీల్లో ప్రసారమయ్యే పలు విన్యాసాలకు సంబంధించిన కార్యక్రమాలు చూసేవాడు. తను కూడా అలా చేయాలని సంకల్పించి ప్రతిరోజూ సాధన చేసేవాడు. ఈ క్రమంలోనే నీటిపై శవాసనం తరహాలో అచేతన స్థితిలో గంటల తరబడి తేలియాడే ప్రక్రియను ప్రాక్టీస్ చేసి విజయం సాధించాడు.
ప్రస్తుతం నీటిపై అచేతనంగా 12 గంటల పాటు ఉండగలనని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. శనివారం మండల కేంద్రంలోని గుంటిచెరువులో 2 గంటల పాటు నీటిపై తేలియాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 30 ఏళ్లుగా ఈ విన్యాసం చేస్తున్న యాకయ్య 2001లో చేతి వేళ్లపై నుంచి వరుసగా 30 కార్లను నడిపించుకున్నాడు. ఛాతీపై 50 కేజీల బరువు గల బండరాయిని పగులగొట్టించుకున్నాడు. తలకిందులుగా సునాయసంగా నడిచే 46 ఏళ్ల యాకయ్య ముక్కు నుంచి నోటిలోకి పూలదండను తీస్తానని చెప్తున్నాడు.
30 ఏళ్లుగా అనేక విన్యాసాలు చేస్తున్నా. మం త్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ చేతుల మీదుగా అనేక అవార్డులు అందుకున్నా. ఉద్యోగ భద్రత కల్పిస్తామని వారు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. దివ్యాంగుడిని కావ డం, తల్లిదండ్రులు లేకపోవడంతో నాకింకా పెళ్లి కాలేదు. ఇంటర్మీడియట్ వరకు చదువుకునే నేను 12 ఏళ్లు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పారా టీచర్‌గా పనిచేశా. నాకు ప్రభుత్వం అటెండర్ కొలువిచ్చి ఆదుకోవాలి.
– వడ్డెపెల్లి యాకయ్య, దివ్యాంగుడు, ఇనుగుర్తి, మహబూబాబాద్ జిల్లా