పర్వతగిరి, నవంబర్ 19 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్, వైస్ చైర్మన్‌పై బుధవారం నిర్వహించే అవిశ్వాస సమావేశానికి పోలీసులు సహకరించాలని ఆ సంఘం డైరెక్టర్లు మంగళవారం ఓ వీడియో సందేశంలో కోరారు. ఇటీవల సొసైటీలో భారీ అవినీతి చోటు చేసుకుందని, చైర్మన్ రైతుల నుంచి క్రాప్ లోన్ కోసం డబ్బులు వసూలు చేశారని, పీఏసీఎస్ భవనం, ప్రహరీ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, ఫర్నిచర్ కోసం అక్రమంగా రూ. 10లక్షలు డ్రా చేశారని ఆరోపించారు.
దీనిపై అవిశ్వాస తీర్మానం కోరుతూ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నెల 20న (బుధవారం) సమావేశం నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించి డై రెక్టర్లకు సమాచారం ఇచ్చారన్నారు.ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్లు అవిశ్వాస తీర్మానం పెట్టొద్దని స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడితో తమను బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకు తమపై దాడి చేస్తారని తెలియడంతో పక్క రాష్ర్టానికి క్యాంపునకు వెళ్లామని, బుధవారం తిరిగి రానున్నామని డైరెక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమపై దాడి జరగకుం డా స్థానిక ఎస్సై, సీఐ, ఏసీపీ, సీపీ తమకు రక్షణ కల్పించి అవిశ్వాసానికి సహకరించాలని కోరుతూ డైరెక్టర్లు సూరినేని సుధీర్‌రావు, మట్టపల్లి అమృతరావు, తూమాటి శ్రీనివాస్‌రావు, వల్లందాసు రంగయ్య, మామిండ్ల అశోక్, పు ల్లూరి భిక్షపతి, చాంప్లా, శ్రీలత, దామెర లక్ష్మీ ఆగయ్య, ఎర్రబెల్లి నిర్మల వీడియో సందేశాన్ని పంపించారు.