నల్లబెల్లి, మే : తాటి వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గోప మండల అధ్యక్షుడు కామగాని దిలీప్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని ముద్ధంపురం గ్రామ శివారు జయముఖి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో సుమారు 150 తాటిచెట్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గౌడ సంఘానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా 150 పైగా ఏపుగా ఎదిగిన తాటి వనాన్ని జెసిబిలు, కూలీల సహాయంతో నరికించి దగ్ధం చేయించారన్నారు.
దీంతో నిరుపేదలైన గౌడ కార్మికులు జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిచెట్లను అక్రమంగా ధ్వంసం చేసిన కళాశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారుల స్పందించి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు భాదిత గీత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.