కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తోడు ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలతో ఆకర్షిస్తోంది. ఇప్పటికే సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఆన్లైన్ టికెటింగ్, టిమ్స్‌తో సులభంగా టికెట్లు ఇస్తుండగా తాజాగా డెబిట్, క్రెడిట్ కార్డులు సహా క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేసి టికెట్లు కొనుగోలు చేసే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ క్యాష్‌లెస్ సదుపాయం ఇప్పటికే హైదరాబాద్‌లో అమలవుతుండగా ఇటీవల వరంగల్ రీజియన్‌లో ప్రయోగాత్మకంగా మొదలైంది. తొలుత దూర ప్రాంతాలకు వెళ్లే 85 బస్సుల్లో ఈ ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్) పరికరాలు వినియోగిస్తుండగా ప్రయాణం మరింత సులభం కానున్నది.
– హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 21
బస్సుల్లో ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్న డ్రైవర్
ఈ రోజుల్లో అంతా టెక్నాలజీమయమైపోయింది. పే యాప్స్(డిజిటల్ పేమెంట్స్) ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నగదు వినియోగం తగ్గి డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా లిక్విడ్ క్యాష్ ట్రాన్జాక్షన్లు అంతగా జరగడం లేదు. కొన్నిసార్లు మనం అప్పటికప్పుడే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతుంటాం. అందుకే అలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆర్టీసీ క్యాష్‌లెస్ విధానంతో ముందుకొచ్చింది.
క్రెడిట్, డెబిట్ కార్డులతో క్యూఆర్ కోడ్‌తో యూపీఐ పేమెంట్స్ తీసుకువచ్చారు. ఈమేరకు వరంగల్ రీజియన్‌లో ఈ-సేవలు అందుబాటులోకి వచ్చాయి. టికెట్లు ఇచ్చే విధానాన్ని సులభంగా మార్చేందుకు ఆర్టీసీ ఇప్పటికే టిమ్స్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా డిజిటల్ పేమెంట్స్ జరపాలని నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్‌కార్డులతో స్వైపింగ్, క్యూఆర్ కోడ్‌తో టికెట్లు కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది. ఈ విధానం ఇప్పటికే హైదరాబాద్‌లో అమలవుతుండగా తాజాగా వరంగల్ రీజియన్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.
డిజిటల్ విధానంతో టికెట్ ఇచ్చే సౌకర్యాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో అమలు చేస్తున్నారు. ఇందుకు కొత్తగా ఐ-టిమ్ యంత్రాలు తీసుకొచ్చారు. ప్రస్తుతం రీజియన్‌లో తొమ్మిది డిపోలు ఉండగా ఐదింటిలో దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులోనే వీటిని ఉపయోగిస్తున్నారు. రీజియన్‌కు మొత్తం 85 ఐ-టిమ్ యంత్రాలు వచ్చాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. పూర్తిస్థాయిలో విజయవంతం కాగానే అన్ని రూట్లలో ప్రతి బస్సులో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరంగల్ రీజియన్ పరిధిలోని సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సు సర్వీసుల్లో క్యాష్‌లెస్ సేవలు అందించేందుకు అవసరమైన మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం కొన్ని బస్సు సర్వీసుల్లోనే ఈ విధానం అమలవుతుండగా త్వరలోనే దశలవారీగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పరికరాల వినియోగంపై సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న అధికారులు బస్సుల్లో సేవలను ప్రారంభించారు. ఐ-టిమ్స్ ద్వారా బస్సుల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయనే వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఐ-టిమ్స్‌కు తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాలి. అన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉండవు. దీన్ని అధిగమించేందుకు వీటిలో రెండు సిమ్ములను వేస్తున్నారు. దీంతో ఏదో ఒక నెట్వర్క్ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాం. తొలుత ప్రయోగాత్మకంగా 85 ఐ-టిమ్స్ వచ్చాయి. ప్రత్యేకంగా డ్రైవర్లకు కూడా శిక్షణ ఇచ్చాం. వాటిని ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లేవాటిలో, రిజర్వేషన్ బస్సుల్లో వినియోగిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో యంత్రాల సమస్యలు వస్తున్నట్లు గుర్తించాం. వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యాష్‌లెస్ లావాదేవీలతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందిస్తాం.
– వి.శ్రీదేవి, ఆర్ఎం