హనుమకొండ, సెప్టెంబరు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాం గ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పంచాయితీల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అధికార పార్టీలోని అత్యధిక మంది ఎమ్మెల్యేలతో వివాదాస్పదం గా ఉంటున్న మంత్రి కొండా సురేఖకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య మరోసారి విభేదాలు తీవ్రమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ భద్రకాళీ ఆల య కమిటీలో కొత్తగా ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించడంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆగ్రహం తో ఉన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఆలయ కమిటీలో తనకు తెలియకుండా నియామకం చేపట్టడంపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కు ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉంటున్న తనవంటి వారిపై అన్ని పార్టీలు తిరిగి వచ్చిన కొండా సురేఖ పెత్తనం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికైనా స్పం దించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తుది నిర్ణయం తామే తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్‌కు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండడంలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద విష యం తేల్చుకుంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.
వరంగల్‌లోని ప్రఖ్యాత భద్రకాళీ ఆలయ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ 11న నియమించింది. దేవాదాయ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య ఈ కమి టీ విషయంలో విభేదాలు నెలకొన్నాయి. ఆలయ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి కొం డా సురేఖ హాజరు కాలేదు. ఆ తర్వాత భద్రకాళీకి బోనాల ప్రతిపాదనపైనా మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వం దల ఏండ్ల సంప్రదాయానికి భిన్నంగా భద్రకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించాలని మంత్రి సురే ఖ ప్రతిపాదించడాన్ని ఎమ్మెల్యే నాయిని, ఆలయ పూజారులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సురేఖ వెనక్కి తగ్గారు. భద్రకాళీ ఆలయ కమిటీలో కొత్తగా ఇద్దరు డైరెక్టర్లను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజరామయ్యర్ ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. రెండురోజుల క్రితం ఈ సమాచారం తెలియడంతో ఎమ్మెల్యే నాయిని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొన్నది.
మొదటి నుంచీ విభేదాలు..
కాంగ్రెస్‌లో మంత్రి కొండా దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య విభేదాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ నియామకాలపై వర్గపోరు కొనసాగుతూనే ఉన్నది. ఈ ఏడాది జూన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళీ ఆలయంలో సంప్రదాయాలకు భిన్నంగా మొక్కులు, పూజలు నిర్వహించేలా దేవాదాయశాఖ మంత్రి హోదాలో కొండా సురేఖ నిర్ణ యం తీసుకోవడంపై నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్రం గా వ్యతిరేకించారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారశైలిపై అధికార పార్టీలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఈ ఏడాది జూన్‌లోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పీసీసీ క్రమశిక్షణ కమిటీ రెండు వర్గాలతో సంప్రదింపులు జరిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమన్వయంతో ఉండాలని సూచించింది. భద్రకాళీ ఆలయ కమిటీ నియామకాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు, ఎమ్మెల్యే నాయినికి మధ్య పంచాయితీ మళ్లీ ముదురుతున్నది.
అదృష్టం కొద్దీ నాయిని గెలిచాడు
నాయిని రాజేందర్‌రెడ్డి అదృష్టం కొద్దీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచారు. అతనిపై నేను ఎలాంటి కామెంట్స్ చేయాలని అనుకోవ డం లేదు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో నాకు ఇద్దరు ధర్మకర్తలను నియమించుకునే స్వేచ్ఛ లేదా? అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను మాత్రమే భర్తీ చేశాను. నాయిని వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
– కొండా సురేఖ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి