ఖిలావరంగల్, జూన్ 3 : రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ మాట్లాడు తూ 2024 వాన కాలం పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. ఈ ఖరీఫ్‌లో 70 లక్షల మంది రైతులకు రూ.7,320 కోట్లు రైతు భరోసాను సమయానికి విడుదల చేస్తే వారు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారన్నారు.
విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు విత్తన చట్టం లేకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. అన్ని పంటల విత్తనాలు కలిసి రాష్ట్రానికి 20 లక్షల క్వింటాళ్లు కావాలన్నారు. ఏటా కల్తీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయినా వ్యవసాయ శాఖ నిర్లిప్తంగా ఉం టుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ 2024-25లో ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతు బీమా పరిహారం తెలంగాణకు రాలేదన్నారు.
కనీసం 2025-26లో మొత్తం రైతుల పంటల ఆధారంగా 2025 జూన్ 15 నాటికి కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ప్రీమియం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో 4 పంటలకు కేంద్ర ప్రభుత్వం కంటే అదనపు కనీస మద్దతు ధరలు ప్రకటించిందని, సన్న ధాన్యానికి మినహా ఏ పంటకు కూడా బోనస్ ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో చింతమల్ల రంగయ్య, జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు, జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల కృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు ఇస్లావత్ నెహ్రూ, శ్రీనివాసరెడ్డి, కొంగర నరసింహస్వామి, కోడెం రమేశ్, మంద అఖిల్, ఈసంపల్లి మ హేందర్, లకరాజు, పస్తం ఎల్లయ్య ఇజ్జగిరి కనకమల్లు, కొండ్లె మల్లయ్య, అకపెల్లి సుధాకర్, గొర్రె సంజీవరెడ్డి పాల్గొన్నారు.