జనగామ, జూలై 5 (నమస్తే తెలంగాణ)/ములుగు రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెంచి ఇస్తామన్న పింఛన్ వెంటనే అమలుచేయాలంటూ దివ్యాంగులు, వృద్ధులు రోడ్డెక్కారు. ఈమేరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ములుగు, జనగామ కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. జనగామలో వీహెచ్పీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం సోమరాజు, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్, ములుగులో జిల్లా అధ్యక్షుడు మంచోజు చంద్రమౌళి ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించారు. దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, 2016 చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలన్నారు. ములుగులో ధర్నాకు ఎమ్మార్పీఎస్ నాయకులు నెమలి నర్సయ్య, శ్యాంబాబు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతిగౌడ్ ముద్దతు తెలిపారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. జనగామలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిశోర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్, వీహెచ్పీఎస్ జిల్లా నాయకులు నగేశ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, చక్రపాణి, సిద్ధారెడ్డి, స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.