మహబూబాబాద్, జూలై 13 : రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని, వారిపై తనకున్న కపట ప్రేమను నిరూపించుకున్నాడని ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రం శివారు ఇల్లెందు రోడ్డులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మేరకు ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను రూ.వేల కోట్లు వెచ్చించి, అందిస్తుంటే, అమెరికాలో ఉన్న రేవంత్‌రెడ్డి తాను తెలంగాణలో ఏదో చేసేందుకు చెప్పే ప్రయత్నంలో రైతులపై తన అక్కసును వెల్లగక్కాడని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్నదాతలకు రైతుబంధు, బీమా ఇస్తుంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా శ్రమిస్తూ రైతులకు ఉచిత కరంట్ అందిస్తుంటే రేవంత్‌రెడ్డి సహించలేకపోతున్నాడని, తెలంగాణలో మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని, దీన్ని ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
రైతులపై తనకున్న కపట ప్రేమను రేవంత్ నిరూపించుకున్నాడన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి నూరుశాతం రైతుల పక్షపాతి అని స్పష్టం చేశారు. ఉచిత కరంట్ రైతులకు అవసరం లేదని రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ రైతులు ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారన్నారు. అన్నం పెట్టే అన్నదాతను సీఎం కేసీఆర్ కళ్లలో పెట్టుకొని చూస్తున్నారని, ఓర్వలేక ఏం చేయాలో తోచక విమర్శలు చేయడం రేవంత్‌కు అలవాటైందని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం సీఎం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంటే కాంగ్రెసోళ్ల కళ్లకు కనిపించడం లేదా..? ప్రశ్నించారు. కర్షకులకు లాభం జరగడం రేవంత్‌కు ఇష్టంలేదని, అందుకే వారికి నాణ్యమైన 24 గంటల కరంట్ ఇవ్వొద్దని మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాల నాయకులు ఆచరిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న కళ్లు లేని కాంగ్రెసోళ్లకు ఇది కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ సమితి సభ్యుడు బానోత్ రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు పర్కాల శ్రీనివాసరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహబూబ్‌పాషా, కౌన్సిలర్లు ఎడ్ల వేణుమాధవ్, దాసరి ఆర్షికారావీశ్, బానోత్ హరిసింగ్, మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, మడత వెంకన్న, మనాది రాజేశ్, పొన్నాల యుగేంధర్, ఆసిఫ్ అలీ, బానోత్ రాము, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, రమేశ్, వెంకన్న, శంకర్, గుర్రాల సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహబూబాబాద్, జూలై 13 : భారతదేశం గర్వపడేలా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం ఐడీవోసీలోని స్టేట్ చాంబర్లో బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెట్టే చందంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. మూడు పంటలు పండించేలా సీఎం కేసీఆర్ నీటి వనరులు, ఉచిత కరెంట్‌ను అందిస్తున్నారన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని రైతులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరంట్‌ను ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ అనడం రైతులను కించపరచడమే అన్నారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను యావత్ తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని, ఓటుతోనే తరిమికొట్టాలని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోమారు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు చూసే నేడు ఈ పరిస్థితిలో ఉంచారని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని, దీన్ని రైతులు గమనించాలన్నారు. ‘సాగు నీరు ఇవ్వలేదు, ప్రాజెక్టు కట్టలేదు, చెరువులు, తూముల మరమ్మతులు చేపట్టలేదు.. రాష్ట్రంలో లోఓల్టేజీ కరంట్‌తో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి ఆవేదనలో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్’ అని గుర్తు చేశారు. పెట్టుబడి లేక, బీడు భూములుగా మారిన తెలంగాణ నేడు పచ్చని పంటపొలాలతో కోనసీమను తలపిస్తున్నదని వివరించారు. తెలంగాణ దేశంలోనే అన్నపూర్ణగా మారిందని, రాష్ర్టానికి వస్తున్న ప్రమాదకరమైన పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎండగట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ సమితి సభ్యుడు బానోత్ రవికుమార్, జేరిపోతుల వెంకన్న, మంగళంపల్లి కన్న, ఎడ్ల వేణుమాధవ్, బానోత్ హరిసింగ్, నిమ్మల శ్రీను పాల్గొన్నారు.