మహాదేవపూర్(కాళేశ్వరం)/ చిట్యాల మే 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాలకు జనం నీరాజనం పలికారు. మంగళవారం ఆరో రోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో ప్రత్యేక పూజలు చేసి చీరె, సారె, ఒడి సమర్పించారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు.
పుష్కరాల్లో ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు పెదవి విరుస్తున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే తాతాలిక గదులు రద్దీకి తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు సరిపడా చలువ పందిళ్లు లేక వృద్ధు లు, చిన్నారులు ఎండ వేడిమికి విలవిలలాడారు.
అదేవిధంగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణమూర్తి (66) ఎండ వేడి తాళ లేక తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. కాగా, పుషరాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జాయ్ రైడ్‌లో భక్తులు ఒక్కొక్కరు రూ. 4500 చెల్లించి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వర క్షేత్ర అందాలను వీక్షించారు. రాత్రి పేద పండితులు నవరత్న మాల హారతి కార్యక్రమం నిర్వహించగా, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. తాతాలిక బస్టాండ్ ప్రాంతంలో అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని, చలివేంద్రాలు పెంచాలని సూచించారు. ప్రతి రోజూ రాత్రి 7.30 గంటల నుండి నిర్వహిస్తున్న సరస్వతీ నవరత్నమాల హారతి ఘట్టాన్ని భక్తులు వీక్షించడానికి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళల సౌకర్యార్థం మాతా శిశు కేంద్రం, షీ గదిని ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని మహిళలు, పాలిచ్చే తల్లులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏర్పాట్లు సరిగా లేవు
పుషరాల్లో అధికారులు ఏర్పాట్లు సరిగా చేయలేదు. సరస్వతీ ఘాట్ వద్ద ఇసుకపై నడిచేందుకు మ్యాట్ వేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. అంతా అస్తవ్యస్తంగా ఉంది. సామాన్య భక్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. చలువ పందిళ్లు సరిపడాలేవు. ఎండకు మాడిపోవాల్సిన పరిస్థితి దాపు రించింది. ఇప్పటికైనా అధికారులు భక్తుల సమస్యలపై దృష్టి పెట్టాలి.
– సతీశ్‌కుమార్, భూపాలపల్లి
అస్వస్థతతో పారిశుధ్య కార్మికుడి మృతి
కాటారం : మండలంలోని గంగారం గ్రామపంచాయతీకి చెందిన పారిశుధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్ (35) వడదెబ్బకు గురై మృతి చెందాడు. సరస్వతీ పుష్కరాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించి ఇంటి వద్ద మృతి చెందాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యదర్శి కరుణాకర్ మృతుడి దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని డీపీవో వీరభద్రయ్య పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
మృతుడి భార్యకు ఉద్యోగం కల్పించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా యూనియన్ నాయకులు మెండ మల్లికార్జున్ రావు, చిట్యాల శశికుమార్, యూనియన్ మండల అధ్యక్షుడు పప్పుల లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. అలాగే ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.