తాడ్వాయి, జనవరి 10 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దెలకు చేరుకొని సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుకు పసుపు, కుం కుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లులకు యాటపోతులను, కోళ్లను సమర్పించి జాత ర పరిసరాల్లో విందు భోజనాలు ఆరగించారు. కాగా, మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ పేరుతో గద్దెలకు వెళ్లే అన్ని దారుల్లో గుంతలు తీయడం, వాహనాలను అడ్డుగా పెట్టడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గద్దెల వద్దకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అయోమాయానికి గురవుతున్నారు.
గద్దెల విస్తరణ పనుల పరిశీలన
గద్దెల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారంలో జరుగుతున్న క్యూలైన్లు, షెడ్ల నిర్మాణం, ఫ్లోరింగ్ పనులను ఆమె శనివారం పరిశీలించారు. సెలవు రోజులు కావడంతో భక్తుల రద్దీ అధకమయ్యే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు దర్శనాలు చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకరతో కలిసి వనదేవతల దర్శనం చేసుకున్నారు.
వ్యూ పాయింట్ ప్రారంభం
జనగలంచ వాగు వద్ద ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మట్లాడుతూ పట్టణ వాసులకు ఆహ్లాదాన్నందించే పచ్చని ప్రకృతి తాడ్వాయి అడవి సొంతమన్నారు. జిల్లాలో బొగత జలపాతం ఎంతోమందిని ఆకర్షిస్తున్నదని, ఇటీవలె జనగలంచ వద్ద బ్లాక్‌బెర్రీ ఐలాండ్, తాడ్వాయి హట్స్ వద్ద సఫారీని ప్రారంభించామన్నారు.