తాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం సమ్మక్క, సారలమ్మలకు భక్తులు ముందస్తు గా మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారాంతపు సెలవు కావడంతో పలు ప్రాంతాల నుం చి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. రద్దీ అధికంగా ఉండడంతో పోలీసు శాఖ అధికారులు భక్తుల భద్రతా దృష్ట్యా 200 మంది సిబ్బందిని నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
భక్తులు మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లుల గద్దెల వద్దకు చేరుకుని గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గద్దెల విస్తరణ పనులు సాగుతుండడంతో ఒక పక్క నుంచే భక్తులను దర్శనాలకు అనుమతించారు. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు గద్దెల వద్దకు వెళ్లకుండానే దూరం నుంచే మొక్కుకుని వెనుదిరుగుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు గద్దెల గ్రిల్స్‌కు తాళాలు వేసి మూసివేయడంతో బయట నుంచే దర్శనాలు చేసుకున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్ గద్దెల వద్ద పర్యవేక్షిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా క్రమపద్ధతిలో పంపించారు.