తాడ్వాయి, ఫిబ్రవరి 14 : వన జాతర మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మహా జాతరకు మరో ఆరురోజులే ఉండడంతో తల్లులకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. వరాలిచ్చే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని దీవెనలు పొందుతున్నారు. బుధవారం పూజారులు మండె మెలిగే పండుగ నిర్వహిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన వారు మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి వాగు ఒడ్డున ఉన్న నాగులమ్మ, జంపన్న గద్దెలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి గద్దెల వద్దకు చేరుకున్నారు.
సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు గద్దెల గ్రిల్స్‌కు తాళాలు వేసి బయటినుంచే దర్శనం కల్పించారు. మధ్యాహ్నం సమయానికి రద్దీ తగడంతో లోపలికి అనుమతించారు. దర్శనం అనంతరం భక్తులు గద్దెలు, జాతర పరిసరాల్లో విడిది చేశారు.