స్మార్ట్‌సిటీ స్కీంలో రూ. 944 కోట్లతో 108 అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ. 427కోట్లతో 54 పనులను పూర్తి చేశారు. రూ.517కోట్లతో చేపట్టిన మరో 54 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో సుమా రు 20 పనులు 10 శాతం వరకే జరిగాయి. ముఖ్యంగా ప్రధాన రహదారుల పనులు మ ధ్యలో నిలిచిపోవడంతో రీ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి. బాలాజీ నగర్ జంక్షన్ నుంచి లేబర్‌కాలనీ వరకు చేపట్టిన 100 ఫీట్ల రహదారి పనుల్లో రోడ్డు మాత్రమే నిర్మించారు. డ్రైనేజీ, డివైడర్లు, హైమాస్ లైట్లు, ఫుట్‌పాత్ నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఎంజీఎం నుంచి కాశీబుగ్గ వరకు నిర్మించాల్సిన రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
మధ్య మధ్యన రోడ్డు నిర్మాణంతోపాటు డ్రైనేజీ, డివైడర్, ఫుట్‌పాత్, హైమాస్ లైట్ల పనులు ఉన్నాయి. పనులు చేయకపోవడంతో పాత కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేసిన అధికారులు మళ్లీ రీ టెండర్‌ను పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ పథకంలో చేపట్టిన పనులన్నీ వందశాతం పూర్తయ్యేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. 50 శాతం పనులు పూర్తి చేసిన అధికారులు మిగతా పనులను గడువులోగా పూర్తి చేయడం కష్టంగా మారింది. రీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. అయితే ప్రధాన రహదారులకు సంబంధించిన రెండు పనులతోపాటు బయోమైనింగ్, పోతననగర్ నాలా పనులు పూర్త య్యే అవకాశాలు కనిపించడం లేదు.
70 రోజుల గడువులో గ్రేటర్ పరిధిలో స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన పనులు వంద శాతం పూర్తి చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 31లోగా స్మార్ట్‌సిటీ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ పనులను వేగంవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గడువులోగా 90 శాతం పనులైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. అయితే పూర్తి చేయాల్సిన 54 అభివృద్ధి పనుల్లో దాదాపు 20 పనులు 10 శాతం మాత్రమే జరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నది. స్మార్ట్‌సిటీ పనులను స్కీం గడువు ముగిసే వరకు పూర్తి చేస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.