ములుగు, అక్టోబర్13 (నమస్తేతెలంగాణ)/తాడ్వాయి : మేడారంలో మంత్రుల పర్యటన ఎడమొహం.. పెడమొహంలా సాగింది. వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ సహా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పలువురు హాజరవుతారని అంతా భావించారు.
అయితే, దేవాదాయశాఖ పరిధిలో నిర్వహిస్తున్న పనులపై సంబంధిత మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. ఆ శాఖ ఉన్నతాధికారులూ డుమ్మా కొట్టారు. ఇక పర్యటనలో పాల్గొన్న స్థానిక మంత్రి సీతక్క మునుపెన్నడూ లేనివిధంగా ముభావంగా ఉన్నారు. ఒక్క మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మినహా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులెవరూ సమావేశానికి హాజరుకాకపోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మేడారం మహాజాతర పనులను 90 రోజు ల్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సోమవారం మంత్రి సీతక్క, మానుకోట ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 251 కోట్లు మంజూ రు చేసిందన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా, పూజారుల సూచన మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మహాజాతరలోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. రోజుకు మూడు షిప్ట్‌ల్లో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికే గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.101 కోట్లు విడుదల చేశామన్నారు. మరో రూ. 71 కోట్ల పనుల కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులను పూర్తి చేయాలన్నారు. గద్దెల విస్తరణలో భాగంగా ముందస్తుగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. మంత్రుల వెంట ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీవో వెంకటేశ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు.