తాడ్వాయి, జనవరి 6 : మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గడువులోపు పనులు పూర్తి చేస్తే చాలు.. అవి భక్తులకు ఉపయోగపడినా లేకున్నా మాకేంటి అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. జాతర పరిసరాల్లో రేకులతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ శాఖ చేపట్టింది. సెప్టిక్ ట్యాంకుల కోసం గుంతలు తవ్వించి దానిపై రక్షణగా తడకలు ఏర్పాటు చేయాలి.
దుర్వాసన రాకుండా, అందులో ఎవరూ పడకుండా చర్యలు చేపట్టాలి. కానీ అధికారులు మాత్రం సెప్టిక్ ట్యాంకుపై కేవలం కవర్ కప్పి వదిలేశారు. జాతర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. భక్తులు సెప్టిక్ ట్యాంకులో పడిపోయో ప్రమాదం ఉంది. అలాగే మరుగుదొడ్ల వద్ద ఓరలతో ఏర్పాటు చేసిన నీటి కుండీలు పగిలిపోయి దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే జాతరకు వచ్చిన భక్తులకు తాగునీటి సౌకర్యం ఎలా కల్పిస్తారో అధికారులకే తెలియాలని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.