నర్మెట, జనవరి 29: భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్ఎస్ పాలనలోనే ఉన్నాయని, ప్రస్తుత సర్పంచ్‌లు చరిత్రలో నిలిచిపోతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, వన నర్సరీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారంతో ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయని అన్నారు. పల్లెలు, తండాలు జీపీలుగా మారాయని తెలిపారు.
ప్రస్తుత సర్పంచ్‌లు చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేశారని పల్లా వివరించారు. సర్పంచ్‌లు మిగిల్చిపోయిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండడంతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎంపీడీవో ఖాజనయీమొద్దీన్, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగరావు, ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది రాజిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.