నల్లబెల్లి : రాష్ట్రవ్యాప్తంగా అధికారుల పాలన కొనసాగుతుండటంతో అభివృద్ధి కుంటు పడిపోయింది. అధికారుల పాలనతో గ్రామాలు(Telangana villages) అస్తవ్యస్తంగా మారాయి. సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాది అయింది. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు(Local body elections) నిర్వహించకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ మేరకు నల్లబెల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలో కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా వేలాది మొక్కలను నాటారు. అలాగే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల వ్యవధిలో పల్లె ప్రకృతి వనాలు విధ్వంసం అయ్యాయి. నాడు కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు డంపింగ్ యార్డులను నిర్మించింది. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు రెండు ప్లాస్టిక్ డబ్బాలను పంపిణీ చేసింది. అయితే ఈ డంపింగ్ యార్డుల ద్వారా తడి చెత్తతో వర్మి కంపోస్ట్ ఎరువులను తయారుచేసి అదనపు ఆదాయం గ్రామపంచాయతీలు సమకూర్చుకునేవి. అలాగే ప్రతి గ్రామానికి స్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టి నలదిక్కులా ఉన్న రోడ్లకు మొక్కలను నాటి ఏపుగా పెంచారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. బూటకపు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల అభ్యున్నతి పై దృష్టి సారించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.