వరంగల్, డిసెంబర్ 13: విలీన గ్రామాల్లో అభివృద్ధి పను లను శరవేగంగా పూర్తిచేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) సమావేశ మందిరంలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి వారు సమీక్ష నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని 13 డివిజన్లలో సీఎంఏ, సాధారణ నిధులు, పట్టణ ప్రగతి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. డివిజన్ల వారీగా జరుగుతున్న అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న, టెండర్ దశలో ఉన్న, మంజూరైన పనులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. 1, 2, 3, 14, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల వారీగా హరితహారం, వీధి దీపాలు, పారిశుధ్య నిర్వహణ, జంక్షన్ల అభివృద్ధితో పాటు తదితర అంశాలపై కార్పొరేటర్ల సమక్షంలో సమీక్ష చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 13 డివిజన్లలో పరిధిలో రూ. 340.14కోట్లతో 2,510 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని అధికారులు వివరించారు. ఇప్పటివరకు రూ.179కోట్లతో చేపట్టిన 1,884 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.56.80కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని 82 పనులు టెండర్లు పూర్తి అయ్యి అగ్రిమెంట్ దశలో ఉన్నాయని, 114 పనులు టెండర్ దశలో ఉన్నాయని, మిగిలిన 309 అభివృద్ధి పనులను త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు వివరించారు. మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ టెండర్లు పూర్తయిన పనులను ఇప్పటికీ ప్రారంభించని కాంట్రాక్టర్లను తొలగించాలని ఆదేశించారు. వేరే కాంట్రాక్టర్లతో వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ తాగునీరు ఇంకా పలు గ్రామాల్లో రావడం లేదన్నారు. అవసరమైన పైప్‌లైన్, ఇంటర్ కనెక్షన్ పనులను వెంటనే పూర్తిచేసి విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్‌భగీరథ ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా జరుగాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అధికారులు విలీన గ్రామాల అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలని అన్నారు. విలీన గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దాలని, ఇందుకు కాంట్రాక్టర్లు సహకరించాలన్నారు. పూర్తిచేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిరోజూ రెండు డివిజన్లలో పర్యవేక్షించాలని సూచించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లిస్తామన్నారు. సమావేశంలో 13 డివిజన్ల కార్పొరేటర్లు, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ, డీఈ, టౌన్‌ప్లానింగ్, కుడా, పబ్లిక్ హెల్త్, ఎన్పీడీసీఎల్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.