కాశీబుగ్గ, జూలై 24: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం అర్ధరాత్రి 19వ డివిజన్ ఓసిటీలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం ఎదురుగా నరేందర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు. జోరువానలోనూ సంబురాలు నిర్వహించారు. అలాగే, ఓసిటీ మైదానంలో అర్ధరాత్రి భారీ వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, డీజే మధ్య నృత్యాలతో ఆకట్టుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ నగరాల్లో మౌలిక వసతుల కప్పనకు మంత్రి కేటీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల నిధులతో తూర్పు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని, సబ్బండ వర్గాలు జననేత మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అబిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే, కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్లో కేక్ కట్ చేశారు.