వర్ధన్నపేట, జనవరి 25 : గ్రామాల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామ సమస్యల పరిష్కారానికి నిధులను విడుదల చేశారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రతి గ్రామానికి సాగునీరు అందుతున్నదన్నారు.
100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున నియమితులైన బాధ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని, ప్రతిరోజూ ఓటర్లను కలుస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు వస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఆత్మ చైర్మన్ గోపాల్‌రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, చొప్పరి సోమయ్య, సిలువేరు కుమారస్వామి పాల్గొన్నారు.
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
పర్వతగిరి : మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పర్వతాల శివాలయం పునఃప్రతిష్ఠాపన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్‌కుమార్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ ఏకాంతంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.