ధర్మసాగర్, మార్చి 30: దేవాదుల మూడో దశ నీటి పంపింగ్ మూడు రోజుల ముచ్చటగానే మిగిలిం ది. అతి కష్టం మీద హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట పంప్‌హౌస్‌లోని ఒక మోటర్‌ను ఆన్ చేసిన ఇంజినీర్లు.. ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలోని టన్నెల్ లీకై నీళ్లు బయటకు ఉప్పొంగడంతో దానిని బంద్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దేవాదుల మూడో దశలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేవన్నపేట వద్ద మూడు మోటర్లతో పంప్‌హౌస్‌ను నిర్మించింది.
ములుగు జిల్లా రామప్ప నుంచి దేవన్నపేటకు టన్నెల్ ద్వారా గోదావరి జలాలు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు తరలించి, అక్కడి నుంచి పంటలకు సాగునీళ్లందించేందుకు ఎగువ ప్రాంతంలోని రిజర్వాయర్లకు తరలించేలా రూపకల్పన చేశారు. దేవన్నపేట నుంచి పైప్‌లైన్ వేయగా, ధర్మసాగర్ రిజర్వాయర్ డెలివరీ సిస్టర్న్‌కు 200 మీటర్ల ముందు మూడు మిషన్ భగీరథ పైప్లైన్లు ఉండడంతో టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. అయితే మూడో దశ పనులు ఎప్పుడో పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంప్‌హౌస్‌ను ప్రారంభించలేదు. దీంతో రిజర్వాయర్లలో నీళ్లు లేక యాసంగి పంటలు ఎండుతున్నాయి.
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీనిని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం హడావిడిగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని ఈ నెల 18న తీసుకొచ్చారు. అయితే మోటర్లు మొరాయించడంతో వెనుతిరిగి వెళ్లారు. ఎలాగైనా పంపులు ఆన్ చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించడంతో సంబంధిత ఏజెన్సీ ఇంజినీర్లను తీసుకొచ్చారు.
వారం రోజులు కష్టపడిన ఇంజినీర్లు ఎట్టకేలకు ఈ నెల 27న తెల్లవారుజామున ఒక మోటర్‌ను ఆన్‌చేసి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లను తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పంప్‌హౌస్‌ను ప్రారంభించాలని ఆదే రోజు సాయంత్రం హడావిడిగా దేవన్నపేటకు చేరుకోగా మోటర్లు మళ్లీ మొరాయించాయి. చివరకు ఒక మోటర్‌ను ఆన్‌చేసి నీళ్ల పంపింగ్‌ను కొనసాగిస్తున్నారు.
దీనిని ప్రారంభించిన మూడో రోజైన ఆదివారం ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలోని టన్నెల్‌కు పలు చోట్ల పొలాల్లో పగుళ్లు ఏర్పడి పెద్ద ఎత్తున నీళ్లు బయటకు వచ్చాయి. సుమారు నాలుగు గంటల జలాలు బయటకు రావడంతో వరి పంటంతా ధ్వంసమైంది. పొలాల్లో పనిచేస్తున్న రైతులు గుర్తించి ధర్మసాగర్ రిజర్వాయర్ సిబ్బందికి చెప్పడంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే మోటర్‌ను బంద్ చేశారు. అనంతరం ఘటన స్థలికి చేరుకున్న ఇంజినీర్లు ప్రమాద తీవ్రత భారీగానే ఉన్నట్లు గుర్తించారు.
భగీరథ పైప్లైన్లకు తప్పిన ముప్పు
ధర్మసాగర్ రిజర్వాయర్ దిగువన 60 ఎంఎల్డీ, 25 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) కెపాసిటీ కలిగిన మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (డబ్ల్యూటీపీ)ను మిషన్ భగీరథ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 270 గ్రామాల దాహార్తి తీరుతుంది. ఆదివారం దేవాదుల టన్నెల్ నుంచి నీళ్లు లీకైన ఘటనలో ప్రమాద తీవ్రతకు మిషన్ భగీరథ షీట్ ట్రాక్‌పై వేసిన దిమ్మెలకు పగుళ్లు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన భగీరథ అధికారులు మరికొంత సేపు మోటార్ నడిస్తే పూర్తిగా పైప్‌లైన్ ధ్వంసమయ్యేదని అంటున్నారు.
ఈ ప్రమాదం పగటి పూట జరిగి రైతులు చూడడంతో మోటర్‌ను నిలిపివేశారని, ఒక వేళ రాత్రి సమయంలో జరిగితే లక్షలాది మంది ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడేవారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 16.5 క్యూమెక్‌ల నీటి డెలివరీ కెపాసిటీ కలిగిన ఒకే మోటర్ నడుస్తున్నది. ఇదే కెపాసిటీతో ఉన్న మరో రెండు మోటర్లు ఆన్ చేయాల్సి ఉంది. ఒకవేళ మూడు మోటర్లు ఒకేసారి నడిపిస్తే పక్కపక్కనే ఉండే టన్నెళ్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
మా పొలంలో బుంగపడింది
నాకు 20 గుంటల భూమి ఉన్నది. రెండు నెలల క్రితం వరి పంట వేశాను. వరి మొత్తంగా ఈనింది. ఒక్కసారిగా పొలంలో బుంగపడి నీళ్లు వచ్చి ఇసుక మేట్టలు వారింది. పంట చేతికి అందే సమయంలో ఇలా అయితే మాకు నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్ముల్ని ఆదుకోవాలి.
– మాచెర్ల బాబు, రైతు, ధర్మసాగర్ గ్రామం
ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి
పైపులైన్ లీకై నా వరి పొలంలో నుంచి నీళ్లు రావడంతో ఇసుక వచ్చి కప్పుకుపోయింది. తీవ్ర నష్టం జరిగింది. జరిగిన నష్టానికి ప్రభుత్వం సహాయం చేయాలి. చాలా సేపు పొలంలో నుంచి నీళ్లు పోయాయి. నేను ఉదయం వరి చేనుకాడికి వచ్చి ఇంటికి పోయిన. పది గంటల సమయంలో పొలం వద్ద పైపు లైన్ లీకైయిందని తెలియగానే వచ్చాను. వరి పంటకు నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి.
– మాచెర్ల సంజీవ, రైతు, ధర్మసాగర్