వరంగల్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ధర్మసాగర్: సాగునీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో రెండు తడులతో చేతికి వచ్చే పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా 60 వేల ఎకరాలను ఎండబెట్టింది. మూడోదశలోని దేవన్నపేట పంపుహౌస్ మోటర్‌ను అతి కష్టం మీద రెండు రోజులు నడుపగా, గత నెల 30న టన్నెల్‌కు లీకేజీలు ఏర్పడడంతో పంపును అధికారులు నిలిపివేశారు. గురువారం మరోసారి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి అధికారులు నీటి పంపింగ్ ప్రారంభించగా, టన్నెల్ నుంచి భారీగా లీకై పొలాల్లోకి వస్తుండడంతో అధికారులు మళ్లీ మోటర్‌ను నిలిపివేశారు.
దేవాదుల ప్రాజెక్టు మూడోదశలోని దేవన్నపేట పంపుహౌస్‌తో యాసంగిలో 60 వేల ఎకరాలకు నీళ్లందించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సరైన ఏర్పాట్లు చేయకుండానే దేవన్నపేట పంపులోని మూడు మోటర్లను ఆన్ చేసేందుకు మంత్రు లు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మార్చి18న పంపుహౌస్ వద్దకు వచ్చారు. సాంకేతిక కారణాలతో అవి ఆన్ కాకపోవడంతో మళ్లీ మార్చి 27న ఇద్దరు మంత్రులు వచ్చి ఒక మోటర్‌ను ఆన్ చేశారు. దేవన్నపేట నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు సాగునీరు చేరే మార్గంలో చివరన 200 మీటర్ల టన్నెల్ ఉన్నది.
మోటర్ ఆన్ చేసిన రెండో రోజే టన్నెల్ నుంచి నీరు లీక్ కావడంతో అధికారులు దానిని నిలిపివేశారు. టన్నెల్లో ఉన్న నీటిని 75 హెచ్‌పీ మోటర్లతో తొలగించిన అధికారులు ఎక్కడ లీకవుతున్నదో గుర్తించి గ్రౌటింగ్ ప్రక్రియతో బుధవారం వరకు మరమ్మతు పూర్తి చేశారు. మళ్లీ గురువారం మోటర్‌ను ఆన్ చేసిన కొద్ది సేపటికే టన్నెల్‌కు బుంగపడి నీళ్లు బయటకు వచ్చాయి. దీంతో మోటర్‌ను నిలిపివేసిన అధికారులు మరమ్మతు ప్రారంభించి టన్నెల్ నుంచి నీటి తొలగింపును ప్రారంభించారు. టన్నెల్లో అక్కడక్కడ ఉన్న మట్టి పొరల వల్లే లీకేజీ అవుతున్నదని గుర్తించారు.
శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టిన తర్వాతే దేవన్నపేట పంపుహౌస్‌లోని మోటర్లను ఆన్ చేసే పరిస్థితి ఉంటుందని సాగునీటి శాఖ అధికారులు చెప్పారు. టన్నెల్ లీక్ కాకుండా చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు చేపడుతామన్నారు. పనులు పూర్తయ్యే వరకు దేవన్నపేట పంపుహౌస్ నుంచి పంపింగ్ ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తర్వాతే పనులు చేపడతామన్నారు. దీంతో యాసంగిలో ఇక్కడి నుంచి ఆయకట్టుకు నీళ్లందే పరిస్థితి లేదు. ప్రభుత్వం సాగునీరు అందిస్తుందని ఆశించిన తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.