సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’, ‘మనబస్తీ – మనబడి’ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పించనుంది. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులను అభ్యసనంలో చురుగ్గా పాల్గొనేలా చేస్తాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూపొందించిన ఈ కార్యక్రమంలో మొదటి విడుతలో జిల్లాలోని 35శాతం పాఠశాలలను ఎంపిక చేసి, నిధులు కూడా కేటాయించిందని చెప్పారు. జిల్లాలో మొత్తం 645 పాఠశాలలు ఉండగా, 223 ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమ అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వరంగల్, ఫిబ్రవరి 22(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి, మనబస్తీ- మనబడి’ కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది పాఠశాల వాతావరణం. ఆకర్షణీయమైన పాఠశాల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం, అభ్యసనానికి ఉపయోగపడే వనరులు విద్యార్థులను పాఠశాల వైపు ఆకర్షించి ఆసక్తిని కలిగిస్తాయి. చదువులో చురుగ్గా పా ల్గొనేలా చేస్తాయి. పాఠశాలలో అన్ని వసతులు అందుబాటులో ఉంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని ఉపయోగించుకుని చదువులో మరింత మెరుగైన ప్రమాణాలు సాధించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన ఈ గొప్ప కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆమె తెలిపారు. మూడు దశల్లో అమలయ్యే ఈ కార్యక్రమం ద్వారా మొద టి దశలో అన్ని ప్రభుత్వ, స్థానిక పాఠశాలల్లో 35 శాతం పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ అమలుపై వాసంతి మంగళవారం ‘నమస్తేతెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లో..
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌గా చేపట్టి మూడు దశల్లో మూడేళ్ల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పర్చాలి. ఈ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం పాఠశాల నిర్వహణ కమిటీ(ఎస్ఎంసీ)లకు బాధ్యతలు అప్పగించబడుతాయి. అభివృద్ధి సంఘాల్లో ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థులు, ఇద్దరు ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సభ్యులుగా ఉంటారు. ప్రతి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసి పాత విద్యార్థులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములను చేస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ డిజిటల్ తరగతి గదులు, ఇతర అంశాలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.
జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు 645 ఉన్నాయి. మొదటి దశలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వీటిలో 223 స్కూళ్లను ఎంపిక చేసింది. మన బడి కార్యక్రమం అమలు కోసం ఈ 223 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించాం. ముందుగా ఆయా పాఠశాలల్లో అవసరాలను గుర్తించాలని పన్నెండు ప్రాధాన్యతాంశాలను తెలియజేశాం. తొలిదశలో అభివృద్దికి ఎంపికైన ప్రతి పాఠశాలలో రెండేసి బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసే పని జరుగుతున్నది. వీటిలో ఒకటి మౌలిక వసతులు, నిధుల వినియోగం కోసం. రెండోది పూర్వ విద్యార్థులు, దాతలు స్కూల్ డెవలప్మెంటు కోసం అందజేసే విరాళాల వినియోగం, నిర్వహణకు. మొదటి ఖాతా ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, స్థానిక ఇంజినీరింగ్ విభాగం ఏఈ పేర, రెండో ఖాతా ఎస్ఎంసీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు క్రియాశీల పూర్వ విద్యార్థుల పేర తెరవడం జరుగుతుంది. బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయడం ఈ వారంలో పూర్తవుతుంది.
ఈ కార్యక్రమం అమలుకు జిల్లా కలెక్టర్ మండలానికో ఇంజినీరింగ్ ఏజెన్సీని ఎంపిక చేశారు. జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ, జీడబ్ల్యూఎంసీ, ప్రజారోగ్య, ఈడబ్ల్యూడీసీ, టీడబ్ల్యూడీసీ, టీఎస్ఎంఐడీసీ తదితర ఇంజినీరింగ్ విభాగాలకు జిల్లాలోని పదమూడు మండలాలను కేటాయించారు. ఈ విభాగాల ఇంజినీర్లు ఎస్‌ఎంసీల ఆధ్వర్యంలో గుర్తించిన అవసరాలకు సంబంధించి ఎస్టిమేట్స్ తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపకల్పన జరుగుతున్నది. ఈ ఆన్లైన్ పోర్టల్‌లో ఇంజినీర్లు ఎస్టిమేట్స్‌ను అప్లోడ్ చేస్తారు. దీనిపై విద్యాశాఖలోని ఇంజినీరింగ్ విభాగం అధికారులు సదరు ఇంజినీర్లకు శిక్షణ కూడా ఇస్తారు. ఎస్టిమేట్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపాక పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులకు ప్రభుత్వం కేటాయించిన నిధుల నుంచి కొంత రివాల్వింగ్ ఫండ్ ముందుగానే ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల తర్వాత జిల్లా, మండల స్థాయి అధికారులతో జిల్లా, అనంతరం ఎస్‌ఎంసీల చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులతో మండల స్థాయి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పన్నెండు ప్రాధాన్యతాంశాలు ఈ కార్యక్రమంలో బలోపేతం చేస్తారు. నీటి సౌకర్యంతో కూడిన టాయిటెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్, పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం, పెద్ద, చిన్న మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్, డిజిటల్ విద్య అమలు వంటివి పన్నెండు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. వీటితో పాటు గార్డెన్, కంప్యూటర్లు వంటి ఇతర అంశాలను కూడా ప్రతిపాదించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్స్‌ను ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తారు. అర్బన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించే టాయిలెట్స్, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్స్కు ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దాతలు, పూర్వ విద్యార్థులను కోరుతున్నం. ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు జరుగుతున్నది.