వికారాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అనే విధంగా జిల్లాలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి తయారైందనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారెంటీ అని ప్రచారం చేసుకున్న రామ్మోహన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఎదురుగాలి వీస్తున్నదనే ప్రచారం జరుగుతున్నది. అటు పార్టీలో.. ఇటు ప్రభుత్వపరంగా రామ్మోహన్‌రెడ్డి ఏం చెప్పినా జరగడంలేదని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండోసారి ఎమ్మెల్మేగా గెలిచిన తనకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్న రామ్మోహన్‌రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి.
ఇటీవల ప్రగతి బాట పేరిట నిర్వహించిన సీఎం బహిరంగ సభలకు సంబంధించి మొదట జిల్లాలో సీఎం సభ షెడ్యూల్లో లేకపోయినప్పటికీ పరిగిలో బహిరంగ సభ పెట్టించిన రామ్మోహన్‌రెడ్డికి బహిరంగ సభలో సీఎం ప్రకటించిన వరాలు శాపంగా మారాయనే చర్చ జరుగుతున్నది. గత రెండున్నరేండ్లుగా మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తూ వస్తున్న రామ్మోహన్‌రెడ్డికి సీఎం బహిరంగ సభతో మంత్రి పదవి ఇక రానట్టే అనేది తేలిపోయింది. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డే బహిరంగ సభ వేదికగా మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి మున్సిపల్ మంత్రి అంటూ ప్రకటించడమే పరిగి ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ప్రకటించడంతో రామ్మోహన్‌రెడ్డి అయోమయంలో పడిపోయారు. రామ్మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ప్రకటనతోపాటు తాండూరుకు వెయ్యి కోట్ల నిధులిస్తామని హామీనివ్వడం చూస్తే పరిగి ఎమ్మెల్యేకు ఇక మంత్రి రాదనేది సీఎం క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జిల్లా అంతటా జోరందుకున్నది. మరోవైపు రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవిని ఢిల్లీ నుంచి తెచ్చుకుంటాడని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్లోనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వపరంగా ఆయనకు ఎదురుగాలి వీస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన 6 నెలల నుంచి కలెక్టర్-రామ్మోహన్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల ఓ జిల్లా అధికారి విషయంలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సంబంధిత కార్యక్రమానికి తాను హాజరుకాకపోవడమే కాకుండా సదరు జిల్లా అధికారిని సెలవులో పొమ్మన్నట్లు సమాచారం.
క్యాబినెట్ బెర్త్‌పై ఆశలు
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రాతినిథ్యం వహిస్తుండగా, వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన ప్రసాద్‌కుమార్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండున్నరేండ్లలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనుకున్న ప్రతీ సందర్భంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారు. ఆరు నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ రామ్మోహన్‌రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. రామ్మోహన్‌రెడ్డితోపాటు పట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు విఫలమైనప్పటికీ తదనంతరం కూడా రామ్మోహన్‌రెడ్డి క్యాబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకోవడం గమనార్హం.
అయోమయంలో రామ్మోహన్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రగతిబాట పేరిట సీఎం బహిరంగ సభ సందర్భంగా మంత్రి పదవి కలే అనేది తేలిపోయింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాకుండా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జునఖర్గేతోపాటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మునియప్ప, ఇతర ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేసి మంత్రి పదవిని తెచ్చుకుందామనుకున్న రామ్మోహన్‌రెడ్డి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యిందనే ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికే రెండున్నరేండ్లు పూర్తికాగా, మరో రెండున్నరేండ్లు ఉండటంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు కూడా లేవనే తెలుస్తున్న దృష్ట్యా రామ్మోహన్‌రెడ్డికి మంత్రి పదవి అనేది కలగానే మారనుందని వినిపిస్తున్నది.
మంత్రి పదవి రంజిత్‌రెడ్డికి అంటూ సాక్షాత్తు సీఎం ప్రకటించిన దృష్ట్యా పరిగి ఎమ్మెల్యే పూర్తిగా అయోమయంలో పడిపోయారు. తన నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టిస్తే రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి, తాండూరు నియోజకవర్గానికి వరాల జల్లును సీఎం కురిపించడంపై ఆయన తన సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరిగి నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్‌ను పూర్తి చేయడమే కాకుండా పరిగి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని సీఎం ప్రకటించడంపై కూడా రేవంత్‌రెడ్డి పరిగి ఎమ్మెల్యేను దూరం పెడుతున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో తీవ్రంగా జరుగుతున్నది.