మద్దూర్, ఫిబ్రవరి 18 : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నాలుగు రోజుల నుంచి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆటవీశాఖ ఆధికారులు ఏర్పాటు చేసిన బోనులో మంగళవారం రాత్రి చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా పిల్లిగుండ్లతండా, మోనినాపూర్, పెదిరిపాడ్ తండాల్లో చిరుత సంచరిస్తుండగా ప్రజలు ఆటవీశాఖ అధికారులకు సమాచరమిచ్చారు.
స్పందించిన అటవీశాఖ అధికారులు రెనివట్ల సమీపంలో బోను ఏర్పాటు చేయగా చిరుత చిక్కింది. ఈ ప్రాంతంలో మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిక్కిన చిరుతను అచ్చంపేట వద్ద మద్దిమడుగు ప్రాంతం నల్లమల అడవిలో వదిలిపెట్టినట్టు అటవీశాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు.