హనుమకొండ చౌరస్తా, జూన్ 4 : కోన్ కిస్కా వచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు.. తెలంగాణ అంటే మనకు అస్తిత్వం.. ఆంధ్రా వాళ్లకు ఆస్తి అని తెలంగాణ వికాస సమితి గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ అశోకా కాన్ఫరెన్స్ హాల్ (అనిశెట్టి రజిత ప్రాంగణం)లో కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ డిక్షనరీలో లేదని ఒకరు మాట్లాడుతున్నారు. తెలంగాణ పౌష్టికాహారం ఆయనకు అందలేదు.. అందుకే పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నాడని అన్నారు.
ఏ ఒక ఆంధ్రా కవి కూడా తెలంగాణ భూములు, వరంగల్ గురించి మాట్లాడలేదన్నారు. కొండారెడ్డి బురుజుపై చంద్రబాబు జెండా ఎగరేస్తే గుండె జారినట్లు అయింది.. చంద్రబాబుకు మన హైదరాబాద్ కావాలి.. పాతబస్తీ వద్దు.. కానీ హైటెక్‌సిటీ, ఓఆర్ఆర్ కావాలని విమర్శించారు. నీళ్లు పారే తెలంగాణలో నెత్తురు పారించే కుట్రలే సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ దండయాత్రల వెనుక ఉన్నది అదే.. ఎందుకంటే తెలంగాణ బంగారం కావాలి.. అందుకనే వాళ్లు ఎప్పుడూ తెలంగాణ ఆస్తులను కోరుకుంటారని విమర్శించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి అన్ని పనులు తానే స్వయంగా చేసుకునే వారని, ఆంధ్రా కవులు కృష్ణారావు, కందుకూరు వీరేశం, మల్లంపల్లి సోమశేఖర్ శర్మ తదితరులు చేసిన పనిని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలంగాణలో ఒకడే చేశారని గుర్తుచేశారు.
అనిశెట్టి రజిత తెలంగాణ కోసం ఎంత పరితపించింది.. ఎకడ సభ పెట్టినా వచ్చేది.. ఎంతో ఆశతో పుస్తకాలు వేసేది.. అటు మహిళా రచయితలను ఒకటిగా చేసేది.. ఇలాంటి గుణం తెలంగాణ కవులకు ఉంటుందని, అందుకే ఈ కవి సమ్మేళనం ప్రాంగణానికి అనిశెట్టి రజిత పేరు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య అక్షరాలకు క్రాఫ్టింగ్ చేసినట్లు మాట్లాడతారని, ఆయన ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. మన కవులు వారి కవితల ద్వారా చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని దేశపతి అన్నారు. అనంతరం తన పాటలతో అందరినీ ఆలోచింపజేశారు.
ప్రముఖ కవులు వీఆర్ విద్యార్థి, రామాచంద్రమౌళి, శివకుమార్, నెల్లుట్ల రమాదేవి, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి మురళీకృష్ణ, ఎన్వీఎన్ చారి, బిల్లా మహేందర్ , తైదల అంజయ్య, బండారి రాజ్‌కుమార్, పెద్ది వెంకటయ్య, సిరాజుద్దీన్, దేవులపల్లి వాణీదేవి, వల్స పైడి, రామా రత్నమాల, బాలబోయిన రమాదేవి, కోడం కుమారస్వామి, శనిగరపు రాజ్ మోహన్, షేక్ హాజీ నూరానీ, కార్తీక రాజు, కుంజ కల్యాణి, నాగవెల్లి జితేందర్ సామ్రాట్ తమ కవితాగానంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కవి సమ్మేళనంలో కార్యదర్శి మల్లావఝల విజయ్, మాలోత్ భిక్షపతినాయక్ , నిమ్మల శ్రీనివాస్, నాగిల్ల రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అని కొత్త వేషం వేసుకొని పాతవాళ్లు వస్తున్నారు. గద్దలను, మోసగాళ్లను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందో దేశపతి శ్రీనివాస్ చూపిస్తాడు. వరంగల్‌తోనే తెలంగాణ ముడిపడి ఉంది. ఆంధ్రా వాళ్లు కూడా రాణి రుద్రమదేవిని గుర్తు చేస్తారు. మొగిలయ్య, కాళోజి, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు లాంటివారు పట్టుబట్టి ఇకడే కవి సమ్మేళనం నిర్వహించారు. 1969 మలి దశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసింది కూడా వరంగల్ నుంచే. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ రచయితల వేదిక మొదటిసారిగా ఇకడ శంఖారావం పూరించింది. అనిశెట్టి రజిత, ఇతర కవులు వారి కవితల ద్వారా నిప్పు కణిక రాజేసింది కూడా వరంగల్ నుంచే. ఎవరో వచ్చి మీ అయ్య జాగీరా అంటే ఎలా ఉంటుంది. మనం కవులుగా చెప్పవల్సింది ఇకడ వరంగల్ కోటలో రాళ్లు ఎత్తిన మనుషులు మా తాతలు, ముత్తాతలే. తెలంగాణ కోసం నిలబడదాం.. జీవిద్దాం.. రాద్దాం.
– నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత