హనుమకొండ చౌరస్తా, జులై 8: కౌన్సిల్ సమావేశంలో ఎజెండా మీద చర్చించకుండా గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. హనుమకొండలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భద్రకాళీ చెరువు పై ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఎఫ్టిఎల్ పరిధి ఎందుకు తగ్గిస్తున్నారు? దీని వెనకాల ఉన్న మతలబేమిటో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, పేపర్ల ప్రకటనకే పరిమితమై ఇంకా ఎమ్మెల్యే చర్చకు రెడీ అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కౌన్సిల్లో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసులు, కార్పొరేటర్లు, మొత్తం మీరే ఉన్నారు. కేవలం 16 మంది మాత్రమే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారన్నారు. భద్రకాళి చెరువు వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. చినుకు పడే వరకు పూర్తి చేస్తామని చెప్పి సగం పనులు కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్కు మీకు ఉన్న ఒప్పందం ఏమిటి? కబ్జా చేయాలని చూస్తున్నారా? అని నిలదీశారు. కాపువాడ సైడు ఎందుకు కట్టను పోశారు, మూడు ఎకరాల భూమిని ఎందుకు కబ్జా చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఆల్రెడీ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. మత్స్యకారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలన్నారు. 5వేల కోట్లతో నగరానికి కావలసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే 500 కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
భద్రాకాళి చెరువులో పడి చనిపోయిన వ్యక్తికి ఎక్స్గ్రెషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్లు అక్రమాలకు పాల్పడ్డారని చర్యలు తీసుకోవాలని బోదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలను మాట్లాడనీయకుండా మైకులు కట్ చేస్తున్నారని, నగరాభివృద్ధిపై చర్చించేందుకు మేము రెడీ అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్ రావు, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, ఇమ్మడి లోహిత రాజు, సోదా కిరణ్, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, పోలంపల్లి రామ్మూర్తి, సంపతి రఘు పాల్గొన్నారు.